హైదరాబాద్, డిసెంబర్ 21: నెదర్లాండ్స్‌కు చెందిన మొబిలిటీ టెక్ సేవల సంస్థ స్టెల్లాంటిస్..హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. వచ్చే మూడేండ్లలో 2,200 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ సాఫ్ట్వేర్ బిజినెస్ హెడ్ మమతా చామర్తి తెలిపారు. భాగ్యనగరంలో నైపుణ్యం కలిగిన సిబ్బంది లభించడంతో ఇక్కడి యూనిట్లో కృత్రిమ మేధస్సు, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సేవలపై మరింత దృష్టి సారించడానికి వీలు పడనున్నదన్నారు. ప్రస్తుతం ఐటీ డివిజన్లో 500 మంది ఉద్యోగులు ఉండగా, త్వరలో 1,200 మంది చేరనున్నారని చెప్పారు. వీరితోపాటు సాఫ్ట్వేర్ డివిజన్లో మరో వెయ్యి మంది జతకానున్నట్లు తెలిపారు. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4,500 మంది సిబ్బందిని కొత్తగా రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించిన ఆమె.. దీంట్లో అత్యధిక భాగం భారత్‌లోనేనని స్పష్టంచేశారు. గ్లోబల్ డిజిటల్ సంస్థ ప్లగ్ అండ్ ప్లేలో.. స్టెల్లాంటిస్ వ్యూహాత్మక పాత్ర పోషిస్తున్నది. ఇప్పటికే ప్లగ్ అండ్ ప్లేకు హైదరాబాద్ ఆఫీస్‌ను ప్రారంభించింది.