విద్యానగర్(కరీంనగర్), మార్చి 12: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు కరీంనగర్‌లోని ప్రతిమ వైద్యశాల అండగా నిలుస్తున్నది. ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్) చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు చొరవ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రోద్బలంతో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ రూ.లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను ఉచితంగా చేస్తూ పేదలకు భరోసా కల్పిస్తున్నది. ఈ నెల 6 నుంచి 12 వరకు ఏడోసారి వైద్యశిబిరం నిర్వహించి 13 మంది చిన్నారులకు ఊపిరి పోసింది. ప్రతిమ ఫౌండేషన్, హీలింగ్ లిటిల్ హార్ట్స్ లండన్ సంయుక్త ఆధ్వర్యంలో యూకే వైద్యబృందంతో కలిసి 6 నెలలకు ఓసారి గుండెవ్యాధితో బాధపడుతున్న వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నది. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తున్నది. శనివారం వైద్యశిబిరం ముగింపు కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ హరిణి, హీలింగ్ లిటిల్ హార్ట్స్ లండన్ వైద్య నిపుణుడు రమణ దన్నపనేని, పిమ్స్ పీడియాట్రిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ చెన్నాడి అమిత్, డాక్టర్ చెన్నాడి జగన్మోహన్రావు, డాక్టర్ రవీందర్రావు, డాక్టర్ పీఎల్ జాన్ ఇజ్రాయిల్, డాక్టర్ రాంచందర్‌రావు, రవీందర్‌రెడ్డి, ఆశిష్, డాక్టర్ నిఖిల్‌తోపాటు యూకే, యుఎఈ వైద్యబృందం పాల్గొన్నారు. హీలింగ్ లిటిల్ హార్ట్స్ లండన్ వైద్య నిపుణుడు రమణ దన్నపనేని మాట్లాడుతూ.. తెలంగాణలో జన్మించిన తాను ఇక్కడి చిన్నారులకు వైద్య సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించేందుకు బోయినపల్లి వినోద్‌కుమార్ చొరవ అభినందనీయమన్నారు. అభివృద్ది చెందిన దేశాల్లో మొదటి సంవత్సరంలోపే 20 శాతం శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారని, ఇక్కడ చిన్నారుల గుండెవ్యాధి నిపుణుల కొరత ఉండటం వల్ల చాలామంది చనిపోవడం బాధిస్తున్నదని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆరు నెలలకోసారి క్యాంప్ నిర్వహించి ఏడాదికి 30 మంది చిన్నారులకు శస్త్ర చికిత్స చేస్తామని ప్రకటించారు.
చిన్నపిల్లల గుండెసర్జరీలకు ప్రతిమ హాస్పిటల్ కేంద్రంగా మారిందని పిమ్స్ పీడియాట్రిక్స్ హెచ్‌వోడీ డాక్టర్ చెన్నాడి అమిత్ అన్నారు. బోయినపల్లి వినోద్‌కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో గుండెవ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు చికిత్స అందించాలని కోరారని తెలిపారు. వెంటనే యూకే వైద్యబృందంతో చర్చించి, ఆరు నెలలకోసారి చిన్నారులకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తూ ముందుకెళ్తున్నామని స్పష్టంచేశారు.
గర్భంలో ఉన్నప్పుడే నా బిడ్డకు గుండెవ్యాధి ఉన్నదని తెలిసి విలవిల్లాడాం. పాప పుట్టిన తర్వాత హైదరాబాద్‌లోని అనేక దవాఖానల్లో చూపిం చాం. రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో అంత స్థోమత లేక ఇంటికి వచ్చాం. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం పాప పూర్తిగా కోలుకుంది. మా బిడ్డకు ఉచితంగా ఆపరేషన్ చేసిన ప్రతిమ యజమాన్యానికి జీవితాంతం రుణపడి ఉంటాం.
– లుంకోజు ఆనంద్, కోతిరాంపూర్, కరీంనగర్