సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : సరికొత్త ఆవిష్కరణలు దివ్యాంగులకు అందుబాటులోకి వస్తున్నాయి. కంటి చూపు లేని వారికి స్మార్ట్ విజన్ గ్లాసెస్… కాళ్లు లేని వారికి ఎలక్ట్రిక్ ట్రై సైకిల్… ఎలక్ట్రిక్ వీల్ చైర్… పక్షవాతం ఉన్న రోగుల కోసం ఆర్మ్ ఎబుల్… ఇలా దివ్యాంగుల కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలను స్టార్టప్ వ్యవస్థాపకులు తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. తెలంగాణ అసిస్టివ్ టెక్నాలజీ సమ్మిట్ 2.0 పేరుతో స్టార్టప్‌లతో కలిసి దివ్యాంగులకు ఉపయోగపడే ఆవిష్కరణలను రూపొందించారు. డిసెంబర్ 3న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలు స్టార్టప్‌లు నూతన ఆవిష్కరణలను పరిచయం చేశాయి. వాటిలో ఉత్తమమైన వాటిని బుధవారం నగరంలోని బంజారాహిల్స్ ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో 10 స్టార్టప్‌లు, 4 స్టూడెంట్ ఇన్నోవేషన్స్, గ్రామీణ ఆవిష్కర్తలు, జాతీయ సంస్థలు ప్రదర్శనలో పాల్గొన్నాయి.
విద్యుత్‌తో నడిచే ట్రై సైకిల్‌తో పాటు ఉపాధి..
ట్రైసైకిళ్లపై వెళ్లే వికలాంగుల కోసం సరికొత్త ఆలోచనతో గేర్డ్ హెడ్ మోటార్ స్టార్టప్ ముందుకు వచ్చింది. నిఖిల్, మెహర్లు స్థాపించిన ఈ స్టార్టప్ విద్యుత్‌తో నడిచే ట్రైసైకిల్‌తో పాటు దానిపైనే ఉపాధి పొందేలా రూపొందించారు. కాళ్లు లేని వారికి ఉపాధి దొరకడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో వినూత్న ఆలోచన ద్వారా వచ్చిన ఈ స్టార్టప్ అందరి దృష్టిని ఆకర్షించింది.
అంధులకు ఆధునిక కంటి అద్దాలు..
కంటి చూపు సరిగాలేని అంధులకు అన్ని విషయాల్లో సహాయపడే ఆధునిక స్మార్ట్ విజన్ గ్లాస్‌ను బెంగళూరుకు చెందిన స్మార్ట్ హెల్త్ గ్లోబల్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. స్మార్ట్ విజన్ గ్లాస్ ద్వారా అంధులు చదవడం, ముఖాన్ని గుర్తించడం, ఎదురుగా ఉన్న వస్తువులను గుర్తించడం, మనుషులా లేదా వస్తువులా అనే విషయాన్ని గుర్తించే పరిజ్ఞానంతో స్మార్ట్ విజన్ గ్లాస్‌ను తీర్చిదిద్దారు. దీని ధర రూ. 25వేల నుంచి రూ. 42వేల వరకు ఉంటుందని స్టార్టప్ నిర్వాహకుల్లో ఒకరైన రాము ముత్తంగి తెలిపారు.
పక్షవాతం ఉన్న వారి కోసం.. ఆర్మ్ ఎబుల్
పక్షవాతం ఉన్న వారికి బీ ఏబుల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ సరికొత్త కంప్యూటర్ గేమింగ్ ఉపకరణాన్ని రూపొందించింది. కాళ్లు, చేతులు, మనసులతో పని చేసేలా ఆర్మ్ ఎబుల్ పనిచేస్తుందని దాని నిర్వాహకులు హబీబ్ అలీ తెలిపారు. టేబుల్‌పై ఉండే పరికరాలతో కంప్యూటర్ స్క్రీన్‌తో అనుసంధానం చేస్తారు. ఇలా కంప్యూటర్ స్క్రీన్, టేబుల్‌పై ఉండే పరికరాలతో పక్షవాతం ఉన్న వారు పనిచేయడం వల్ల వారి శరీర అవయాల పని తీరు మెరుగుపడుతుందని హబీబ్ తెలిపారు.
వీల్ చైర్‌కు ఎలక్ట్రిక్ కిట్..
వికలాంగులు వినియోగించే వీల్ చైర్‌ను మరింత ఆధునికంగా, అందుబాటులో ధరలో ఆటోమోటివ్ వీల్ స్టార్టప్ రూపొందించింది. చేర్యాలలోని గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన చిన్మయి రంజన్ నాయక్, ప్రశాంత్‌కుమార్, బి.రాకేష్ కలిసి రూపొందించిన ఎలక్ట్రిక్ వీల్ చైర్‌ను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రత్యేకంగా ఎంపిక చేసింది. తక్కువ ధరలోనే సాధారణ వీల్‌చైర్‌కు ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చారు. గంట సేపు చార్జింగ్ చేస్తే, 2-3 గంటల పాటు వీల్ చైర్ నడిచే అవకాశం ఉంది.
అందరికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
అన్నీ ఉన్న వారికే కాకుండా అంగవైకల్యం ఉన్న వారికి కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాం. డిసెంబరు 3న నిర్వహించిన తెలంగాణ సహాయక సాంకేతిక సదస్సు రెండోవిడత కార్యక్రమంలో అంగవైకల్యం కలిగిన వారికి ఉపయోగపడే 20కిపైగా స్టార్టప్‌లు ముందుకు వచ్చాయి. అందులో అత్యంత ప్రభావితమైన, అంగవైకల్యం కలిగిన వారు వెంటనే ఉపయోగించే 10 స్టార్టప్‌లకు చెందిన ఉత్పత్తులను ఎంపిక చేసి, ఈ ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేయించాం.