పాలమూరు, మార్చి 28 : రైతులను రాష్ట్ర సర్కార్ దగా చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ మండలంలోని మిల్లును గురువారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఇంట్లో బియ్యం తినాల్సిన రైతు నూకలను కొని తినాల్సిన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని రెండు నెలలుగా నానా కష్టాలు పడ్డామని చివరకు మిల్లులకు తరలిస్తే తరుగు పేరిట మద్దతు ధర లేకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తడిసిన ధాన్యం కొంటామని చెప్పి అది కూడా కొనడం లేదని రైతులు వాపోయారు.
వచ్చిన కాడికి అమ్మిన రైతులు మిల్లుల నుంచి నూకలు కొంటుంటే చూసి మాజీ మంత్రి చలించి పోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో వాస్తవాలను ప్రభుత్వం తెలుసుకోవాలని సూచించారు. రోహిణి కార్తె రావడంతో పంటలు వేసుకునేందుకు రైతులు సిద్ధం అవుతుంటే కనీసం పిండి సంచులు, ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేవని తెలిపారు. ‘పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.