హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ 2025-26 సీజన్ లీగ్ దశను శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ డ్రాతో ముగించింది. శుక్రవారం గోవాలోని పీజేఎన్ స్టేడియంలో ఉత్కంఠగా సాగిన తమ ఆఖరి మ్యాచ్‌ను శ్రీనిధి జట్టు 1-1తో స్థానిక డెంపో ఎస్సీ జట్టుతో డ్రా చేసుకుంది. ఆట ప్రారంభమైన 5వ నిమిషంలోనే ఆతిథ్య డెంపో ఎస్సీ జట్టు అటాకింగ్ గేమ్ ఆడింది. ఈ క్రమంలో లభించిన కార్నర్‌ను మార్కస్ జోసెఫ్ అద్భుతమైన హెడర్‌తో గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
ద్వితీయార్థం 71వ నిమిషంలో శ్రీనిధి ఆటగాడు లాల్చుంగ్నుంగ అందించిన క్రాస్‌ను పోస్ట్ వద్ద ఉన్న దీపక్ హెడర్ ద్వారా గోల్ పోస్ట్ వైపు మళ్లించాడు. అక్కడే సిద్ధంగా ఉన్న హాది ఇద్రిస్సు బంతిని నెట్లోకి పంపడంతో స్కోరు 1-1తో సమమైంది. ఈ డ్రాతో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ మొత్తం 14 మ్యాచ్‌ల్లో 26 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.