‘చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి’ అనిసాగే జయదేవుని అష్టపది తెలియని కృష్ణభక్తులు ఉండరు. అంతేనా… ఆ చందనం వాసన ఆస్వాదించని వాళ్లూ ఉండరు. చందనాన్ని ఆంగ్లంలో ‘శాండల్ వుడ్’ అంటారు. సువాసనలు వెదజల్లే చందనం సౌందర్య సాధనాల మార్కెట్లో ఎంతగా పరిమళిస్తున్నదో కొత్తగా చెప్పేదేమీ లేదు. ముఖ్యంగా సబ్బుల తయారీలో దీన్ని ఎక్కువగా వాడతారు. చందనం చెక్క నుంచి తీసే తైలం వాసన మేధస్సును పెంచుతుందని చెబుతారు.
చందన తైలాన్ని పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులకు, కాలిన గాయాలకు ఈ లేపనం ఉపశమనం కలిగిస్తుంది. మార్కెట్లో చందనపు చెక్క, చందన పొడి, చందన తైలం అనేక విధాలుగా అందుబాటులో ఉన్నాయి. చర్మాన్ని గంధం మృదువుగా ఉంచుతుంది. చర్మంపైన ఉండే వ్యర్థాలను ఈ లేపనం తొలగిస్తుంది. చర్మం పొడిబారకుండా చేసి, కాంతిని పెంపొందిస్తుంది. చర్మాన్ని చల్లబరచడమే కాకుండా మొటిమలు, దద్దుర్లు తగ్గించడంలో సాయపడుతూ యాంటీ సెప్టిక్‌గా పని చేస్తుంది. అరోమా బాత్కు, పెర్ఫ్యూమ్ తరహాలోనూ చందనాన్ని వాడుకోవచ్చు.
గంధం నుంచి వచ్చే ప్రత్యేక సువాసన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ధ్యానం, పూజ తదితరాల్లో ఏకాగ్రతకు ఈ సువాసన తోడ్పడుతుంది. కలియుగ దైవం వేంకటేశ్వరుని అలంకరించే తిరునామంలో గంధం స్థానం పొందింది. తిరుమల కొండలపై విరివిగా కనిపించే శ్రీగంధం చెట్లు చాలా విలువైనవి. మైసూరు నగరంలో ఈ చెక్క కలపతో చేసిన అనేక విగ్రహాలు, దండలు, పూజా ద్రవ్యాలు అమ్మకానికి ఉంటాయి. చందనం చెట్టు పూలు చాలా చిన్నగా ఉంటాయి. గింజలు మిరియాల్లా ఉంటాయి.
ఇది సుగంధాన్నిచ్చే చెట్టు. బాగా ఎదిగిన చందనం చెట్టుని నరికిన తర్వాత చిన్న చిన్న పేళ్ళను తీసి మార్కెట్లో అమ్ముతారు. గంధం చెక్కను సాన మీద అరగదీస్తే సువాసన వస్తుంది. శ్రీగంధం చెట్టు స్వతహాగా భూమి నుంచి పోషకాలు గ్రహించలేదు. వేరే మొక్కల వేళ్లతో భూమిలోనే కలిసి నీటిని, పోషకాలను గ్రహించగలదు. అందుకే ఈ చెట్ల కింద కంది, సరుగుడు, కరివేపాకు లాంటి మొక్కలను నాటాలి. తేలికపాటి ఇసుక, ఎర్ర నేలలో ఈ చెట్టు పెరుగుతుంది. దీని గింజలను తినడానికి అనేక రకాల పక్షులు వస్తాయి. ఈ శ్రీగంధం చెట్లు పొలం గట్లపై అక్కడక్కడా కనిపించినా, వాణిజ్యపరంగా కూడా పండించవచ్చు. శ్రీగంధం చెట్టుని కొట్టివేయడం చట్టపరంగా నేరం. పెంచడానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. మా వనంలోనూ శ్రీగంధం చెట్లున్నాయి. ఎన్ని ఉన్నాయో మీరే వచ్చి చూడండి!
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు