
సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ ): మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. దసరా లోపు ఎస్టీపీల నిర్మాణం పూర్తయ్యేందుకుగానూ 24 గంటల పాటు పనులు జరపాలని, మూడు షిఫ్టుల్లో కార్మికులు పని చేసేలా చూసుకోవాలని సూచించారు. ఎస్టీపీల నిర్మాణ ప్రాజెక్టు ప్యాకేజీ – 3లో భాగంగా ఫతేనగర్, ప్రగతినగర్, దుర్గం చెరువులో నిర్మిస్తున్న సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణ పనులను గురువారం ఎండీ దాన కిశోర్ పరిశీలించారు. ఎస్టీపీ ప్రాంగణంలో మూడు షిఫ్టుల్లో సైట్ ఇంజనీర్లు కచ్చితంగా పనులను పర్యవేక్షించాలని, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని ఎండీ స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో పనులు జరుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సరిపడా వెలుతురు ఉండేలా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. నిర్మాణ ప్రదేశంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
కార్మికులు కచ్చితంగా రక్షణ పరికరాలను ఉపయోగించేలా చూడాలని ఆయన చెప్పారు. నిర్మాణ పనుల వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా చుట్టూ బ్లూ షీట్స్ ఏర్పాటు చేయాలని ఎండీ తెలిపారు. ఎస్టీపీ ప్రాంగణంలో వివిధ దశల నిర్మాణ పనుల వివరాలతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఎండీ దానకిశోర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం.సత్య నారాయణ , ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీ విభాగ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.