సీసీటీవీల నిర్వహణకు ప్రత్యేక సంస్థ
తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీకి బాధ్యతలు
సిబ్బంది సంక్షేమానికి వెల్ఫేర్ సొసైటీ’ ప్రారంభించిన డీజీపీ మహేందర్‌రెడ్డి
పోలీసుల సంక్షేమానికి ముఖ్యమంత్రి ప్రాధాన్యం: డీజీపీ
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ)ః శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా దాదాపు 9 లక్షల సీసీటీవీ కెమెరాల నిర్వహణకు ప్రత్యేకంగా ‘తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ’ అనే సంస్థను ఏర్పాటు చేసినట్టు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున సీసీటీవీ లను ఏర్పాటు చేసినా వాటి నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహేందర్‌రెడ్డి మాట్లాడారు. శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ’ని ఏర్పాటు చేశామని చెప్పారు. దీని ద్వారా సీసీటీవీ ప్రాజెక్ట్ నిర్వహణను నిరాటంకంగా కొనసాగిస్తామని వెల్లడించారు.
తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు
తమ అధికారులు, సిబ్బంది సంక్షేమంలో భాగంగా పోలీస్‌శాఖ మరో కీలక ముందడుగు వేసింది. ఇప్పటికే పోలీసుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించిన పోలీస్‌శాఖ ప్రతీ అధికారి, సిబ్బంది తమ పదవీ విరమణలోగా సొంత ఇల్లు లేదా కనీసం ఒక ప్లాట్ కలిగి ఉండేలా తగు ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా ‘ తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ’ని ఏర్పాటు చేసింది. ఈ సొసైటీ నిర్వహణ తీరు తదితర అంశాలపై డీజీపీ శుక్రవారం పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర పోలీస్ అధికారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని డీజీపీ తెలిపారు. దీనిలో భాగంగానే తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటుకు అనుమతించారని వివరించారు. సొసైటీకి స్వచ్ఛందంగా విరాళాలు అందించేవారికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని చెప్పారు.
కొవిడ్‌తో మృతిచెందిన పోలీసుల పిల్లలకు స్కాలర్షిప్స్
కొవిడ్‌తో మృతిచెందిన పోలీసుల పిల్లలకు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి స్కాలర్షిప్స్ అందజేశారు. సీఎస్ఆర్ పథకంలో భాగంగా 25 మంది విద్యార్థులకు హెచ్డీఎఫ్సీ సమకూర్చిన రూ.15వేల నుంచి రూ.75వేల చెక్కులను డీజీపీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీలు ఉమేశ్ షరాఫ్, జితేందర్,హెచ్డీఎఫ్సీ అధికారులు తరుణ్దరి, బద్రివిశాల్, జోస్ స్టీఫెన్లు పాల్గొన్నారు.