IT Employee Suicide | ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇద్దరు కవల పిల్లలకు తల్లైంది.. ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని నడుపుతున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని పోచారంలో విషాదం నింపింది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మౌనిక సంతోషి (28)గా గుర్తించారు. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు భర్త వేధింపుల ఆరోపణలు చేయగా.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మౌనిక సంతోషి (28), వైజాగ్‌కు చెందిన రమాకాంత్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి సుమారు ఎనిమిదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కవల కుమారులు ఉన్నారు. ప్రస్తుతం వారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలోని పోచారం డివిజన్ గెలాక్సీ టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. మౌనిక యాక్సిస్ బ్యాంక్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా.. రమాకాంత్ ఇన్ఫోసిస్‌లో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు.
ఇదిలా ఉంటే శనివారం రాత్రి మౌనిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చిన సమయంలో తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. లోపలికి వెళ్లి చూడగా మౌనిక అపస్మారక స్థితిలో కనిపించడంతో కుటుంబసభ్యుల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
మౌనిక, రమాకాంత్ దంపతుల మధ్య పిల్లలకు సంబంధించిన విషయాలపై తరచూ గొడవలు జరిగేవని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. శనివారం రాత్రి కూడా ఇలాంటి వివాదమే జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, రెండున్నరేళ్ల కవల పిల్లలు తల్లిని కోల్పోవడంతో మౌనిక, రమాకాంత్ కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.