మెదక్, డిసెంబర్ 31 : బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత అని, చిన్నారులతో వెట్టి చాకిరీ చేయిస్తే కేసులు నమోదు చేస్తామని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని హెచ్చరించారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్‌పై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటని చెప్పారు. 5 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లలను బాల కార్మికులుగా పరిగణిస్తారని తెలిపారు. పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగం, కర్మాగారాలు, హోటళ్లు, రైల్వే, బస్ స్టేషన్లు తదితర రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. ఆపరేషన్ ముస్కాన్ 7లో భాగంగా మెదక్ జిల్లాలో 161 మంది బాల కార్మికులను కాపాడామన్నారు. వీరిలో 143 మంది బాలుర ఉండగా, 18 మంది బాలికలు ఉన్నారన్నారు. పునరావాస చర్యల్లో భాగంగా పోలీసులు వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.
బాల కార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్లు సమాచారం ఉన్నా 1098 చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి చిల్డ్రన్స్ హోంకు తరలిస్తారని తెలిపారు. ఏటా జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్ నిర్వహించడంతో పాటు జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని వివిధ శాఖల సమన్వయంతో పోలీసు శాఖ అమలు చేస్తుందన్నారు. ఆపరేషన్ ముస్కాన్ 8 పేరుతో అధికార యం త్రాంగం ప్రత్యేకంగా రెండు బృందాలను రంగంలోకి దించామన్నారు.
బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే క్రిమినల్ కేసులు
సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్లలో ఇప్పటికే అధికారులు, సిబ్బందిని నియమించామన్నారు. బాల కార్మికులను బలవంతంగా పనిచేయించిన, పనిలో పెట్టుకున్నట్లు సమాచారం ఉంటే 100, పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ 7901100100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతకు ముందు ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్‌లో రెస్క్య్ చేసిన పిల్లల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషినల్ డీసీపీ మహేందర్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ రాంగోపాల్‌రెడ్డి, డీసీపీఆర్వో రాము, రాజలింగం, లేబర్ ఆఫీసర్ నాగరాజు, సీఐ యాలాద్రి, ఎస్సై ముకేద్పాషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.