తరం మారుతున్నది. స్వరం మారుతున్నది. నిన్న మొన్నటి వరకూ ఉద్యోగం వస్తే చాలనుకున్నారు. ఇప్పుడు అక్కడితో ఆగిపోవడం లేదు. అంకుర సంస్థలకు ప్రాణం పోస్తున్నారు. కొత్త ఐడియాలతో వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. నలుగురికీ ఉపాధి కల్పిస్తున్నారు. బ్రాండింగ్, మార్కెటింగ్, అమ్మకాలు.. ప్రతీ వ్యూహానికి సామాజిక మాధ్యమమే ఆధారం. సోషల్ మీడియా పునాదిగా విస్తరిస్తున్న మహిళా ఆంత్రప్రెన్యూర్స్పై ప్రత్యేక కథనం..
హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన స్వాతి భావన అమెరికా వెళ్లి, కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. ప్రముఖ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చినా తిరస్కరించారు. లక్షల్లో జీతం, విలాసవంతమైన జీవితం వద్దనుకున్నారు. స్వాతి ఆలోచనంతా.. ఆంత్రప్రెన్యూర్‌షిప్ చుట్టూ తిరిగేది. ఆ లక్ష్యంతోనే భారత్‌కు తిరిగి వచ్చేశారు. అనుభవం కోసం బెంగళూరులోని నోల్స్స్కేప్ అనే స్టార్టప్‌లో కొంతకాలం పనిచేశారు. గేమింగ్ సిమ్యులేటర్‌ను సొంతంగా అభివృద్ధి చేశారు. తన ఆలోచనలకు రూపమిస్తూ ఈవైబ్.ఇన్ అనే అంకుర సంస్థను స్థాపించి .. వివాహాలు, వార్షికోత్సవాలు, పుట్టినరోజు వేడుకలకు ఆన్లైన్ వేదికగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కంపెనీ 20 మందికి ప్రత్యక్షంగా, 200 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నది. ‘ఎమర్జింగ్ ఉమెన్ ఆంత్రప్రెన్య్రూర్’గా తెలంగాణ ప్రభుత్వం నుంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నారు స్వాతి.
నగరంలోని అతికొద్ది మంది చాక్లెటేరియన్లలో దివ్యసాగర్ మల్లెల ఒకరు. సోషల్ మీడియా ద్వారా తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వినియోగదారుల ఆదరణను సంపాదించుకున్నారు. గతంలో ఆమె ఎన్నో ఉద్యోగాలు చేశారు. ఆ అనుభవం కార్పొరేట్ సంస్కృతిని పరిచయం చేసింది. భర్త ప్రోత్సాహంతో 2019లో ‘రెనీ బేకర్స్’ పేరుతో హోమ్ మేడ్ చాక్లెట్లను అందించే స్టార్టప్‌ను ప్రారంభించారు. అందులోనూ ఆరోగ్యకరమైన దినుసులను వాడటం ఆమె ప్రత్యేకత. దీంతో ‘ఇన్నొవేటివ్ చాక్లెటేరియన్’గా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరించుకున్నారు. పండుగలకు కార్పొరేట్ గిఫ్టింగ్ కూడా చేస్తుంటారు దివ్య.
మణికొండకు చెందిన లిఖిత అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి బీఏ చేశారు. చిన్నప్పటి నుంచీ ఆమె లక్ష్యం ఒక్కటే.. తాను బతుకుతూ నలుగురినీ బతికించడం. చదువు తర్వాత మూడు నెలలు బొటిక్ నిర్వహణలో శిక్షణ తీసుకున్నారు. ఎంబ్రాయిడరీ, స్టిచింగ్‌లో అనుభవం సంపాదించారు. చాలామంది మహిళలు అక్కడితో ఆగిపోయి, ఏదైనా షాపులో పనికి చేరిపోతారు. కానీ లిఖిత అలా చేయలేదు. సాంకేతికత సాయంతో ‘మై లక్కీ క్లోసెట్’ అనే స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. ఎంబ్రాయిడింగ్లో ప్రత్యేకతను చాటుకున్నారు. ఓవైపు గృహిణిగా, మరోవైపు స్టార్టప్ వ్యవస్థాపకురాలిగా పదిమందికి ఉపాధి అందిస్తున్నది.
మహిళా ఆంత్రప్రెన్యూర్లకు భావితరాల్లో స్ఫూర్తిని నింపే సామర్థ్యం ఉంది. స్త్రీలు వ్యాపారం ప్రారంభించడానికి మాత్రం రకరకాల కారణాలు. ఎడెల్ గివ్ ఫౌండేషన్ సర్వే ప్రకారం.. 64 శాతం మంది మహిళలు కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్లే ఆంత్రప్రెన్యూర్లుగా మారామని చెప్పారు.
వ్యాపారంతో ఆర్థిక స్వేచ్ఛ సాధ్యం అవుతుంది. ఆర్థిక స్వేచ్ఛతో సాధికారత సొంతం అవుతుంది. వ్యాపారం ఆర్థిక విజయాన్ని ఇస్తుందన్న ఆశావాదం 63 శాతం మందిలో కనిపించింది.
దాదాపు 53 శాతం మంది మహిళా ఆంత్రప్రెన్యూర్లు తమ సంపాదనను పిల్లల చదువులకు ఉపయోగిస్తున్నారు. పిల్లల కలలనూ, ఆశలనూ నిజం చేయడానికి తమవంతు సహకారం అందిస్తున్నారు.
ఆంత్రప్రెన్యూర్‌షిప్ వల్ల కుటుంబంలో, సమాజంలో తమ స్థాయి గణనీయంగా పెరిగిందని 80 శాతం మంది మహిళలు భావిస్తున్నారు. సాధారణ గృహిణిగా కంటే, వ్యాపారవేత్తగానే నలుగురిలో గుర్తింపూ గౌరవమూ లభిస్తుందని వారు బలంగా విశ్వసిస్తున్నారు.
మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో.. ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో మహిళల భాగస్వామ్యం బలంగా వేళ్లూనుకోలేదు. దేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం గ్రామాల్లో 26.4 శాతం, పట్టణాల్లో 20.4 శాతం మాత్రమే ఉంది.
ఇడుమాల కిరణ్‌కుమార్