న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దేశంలో 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి రబీ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలను(ఎంఎస్పీ) సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తిరస్కరించింది. గోధుమల ఎంఎస్పీలో క్వింటాల్‌కు రూ.25 పెంపును రైతుల పట్ల అవమానంగా అభివర్ణించింది. ఇందుకు నిరసనగా ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతులను దహనం చేయాలని ఎస్కేఎం రైతులకు, గ్రామీణ యువతకు పిలుపునిచ్చింది.
కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 30న కొత్త కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలిపింది. దీనివల్ల గోధుమల ధర క్వింటాల్‌కు రూ.2,610కి పెరిగింది. అయితే ఈ పెంపు కేజీకి కేవలం 25 పైసలు మాత్రమేనని పేర్కొన్న ఎస్కేఎం ఉత్పత్తి వ్యయంపై 106 శాతం రాబడి వస్తున్నదన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. సమగ్రమైన సీ2 వ్యయానికి బదులుగా ఏ2+ఎఫ్ఎల్ సూత్రాన్ని ఉపయోగించి ఈ లెక్కలు వేశారని, దీనివల్ల కేవలం 43 శాతం మార్జిన్ మాత్రమే లభిస్తుందని ఎస్కేఎం వాదించింది.
ఎస్కేఎం గణాంకాల ప్రకారం గోధుమల కనీస మద్దతు ధర సీ2+50 శాతం స్థాయి కంటే కూడా రూ.134 తక్కువగా ఉంది కాబట్టి దీనిని రూ. 3,418కి పెంచాలి. మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా వంటి రాష్ర్టాల నుంచి వచ్చిన అధిక ఎంఎస్పీ సిఫార్సులను కేంద్రం పట్టించుకోకపోవడాన్ని ఎస్కేఎం విమర్శించింది. ఇది కాలం చెల్లిన వ్యయ డాటా అని, ఇటీవలి డీజిల్ ధరల పెరుగుదల, పరిమిత సేకరణను పరిగణనలోకి తీసుకోలేదని ఎఎస్కేఎం ఎత్తిచూపింది. గత సీజన్లో గోధుమ పంటలో సుమారు పావు వంతు మాత్రమే కొనుగోలు చేసిందని పేర్కొంది. కనీస మద్దతు ధర అనేది కాగితంపై ఉన్న ధర మాత్రమేనని ఒక ప్రకటనలో తెలిపింది.