డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ఆ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో జరిగిన కారు ప్రమాదం(Truck Car Collision)లో ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ట్రక్కు, ఇన్నోవా కారు ఢీకొన్న ఘటనలో ఈ విషాదం నెలకొన్నది. తెల్లవారుజామున రెండు గంటలకు ఓఎన్జీసీ కూడలి వద్ద ప్రమాదం జరిగింది. కారులో ఏడుగురు విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. దాంట్లో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు దుర్మరణం పాలయ్యారు. ఆ ఆరుగురూ స్పాట్లోనే ప్రాణాలు వదిలారు.
ఒక విద్యార్థి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులంతా ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నట్లు తెలిసింది. భీకరంగా ట్రక్కు ఢీకొనడంతో.. ఇన్నోవా ముక్కలైంది. కారును కట్ చేసి మృతదేహాలను వెలికి తీయాల్సి వచ్చింది. ట్రక్కు డ్రైవర్ అక్కడ నుంచి తప్పించుకున్నాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి మృతదేహాలను వెలికితీశారు. డూన్ ఆస్పత్రికి విద్యార్థులు మృతదేహాలను పంపారు. గాయపడ్డ విద్యార్థిని మహంత్ ఇంద్రేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతిచెందిన వారిలో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిని గునీత్(19), కామాక్షి(20), నవ్య గోయల్(23), రిషబ్ జైన్(24), కునాల్ కుక్రేజా(23), అతుల్ అగర్వాల్(24) ఉన్నారు. గాయపడ్డ వ్యక్తి సిద్దేశ్ అగర్వాల్ మాత్రం డెహ్రాడూన్‌కు చెందినట్లు గుర్తించారు.