ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ‘తామర’ పేరుతో తొలిసారి ఓ అంతర్జాతీయ చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఛాయాగ్రాహకుడు రవి కె చంద్రన్ దర్శకత్వం వహించబోతున్నారు. శనివారం ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో ఓ అమ్మాయి తల పక్కకు తిప్పుకొని కనిపిస్తున్నది. ఇండో-ఫ్రెంచ్ భాగస్వామ్యంలో నిర్మించనున్న ఈ చిత్ర కథ, కథనాలు ఆద్యంతం ఉత్కంఠగా సాగుతాయని చెబుతున్నారు. ‘వినూత్న కథాంశమిది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.