అటకెక్కిన తాంబాలం కిందికి దింపి…
తనబ్బిలున్న శిబ్బి బయటికి తీసి..
సజ్జ మీదున్న ఈతసాప భవంతిల పర్శి..
గడెంచ మీదున్న పూలగంప తెచ్చి..
గుమ్మడాకులు అడుగున పెట్టీ..
తంగేడు పూలతో అమ్మమ్మ
తాంబాలం ముస్తాబు చేయంగా..
మొగురానికొర్గి గునుగు పూలకు
రంగులద్దే తాతయ్య..!
పట్టు సీతమ్మ గుత్తులొక వరుస మెరువగ..
రంగురంగుల రుద్రాక్షలతో..
పట్నం బంతి పూలతో..
గోరంట రెక్కలతో బతుకమ్మను పేర్వంగ..
కట్లపూల నడుమ గౌరమ్మ కొలువుదీరగా..
అర్రల పీట మీద ముగ్గేసి
బతుకమ్మలను కుదించిరి..
సిరిసిల్ల చీరలు గట్టి..
మక్కసత్తు ముద్దలు సుట్టి..
ఆడబిడ్డలు అద్దం ముందు ముస్తాబు కాంగ..
మూడు కాళ్ల ముసలవ్వ
నడువుర్రని ఏగిరవెట్టే..
డప్పు సప్పుళ్లతో, ఊదుబత్తి వాసనలతో..
బతుకమ్మలు బైలెల్లగ
గాజుల సప్పుల్లతో బతుకమ్మ పాటలు
అందుకొనే చింతకింది రాధవ్వ
ఇద్దరక్కచెల్లెండ్లనూ ఉయ్యాలో..
ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో..
కట్టసుఖాల బతుకు పాటలు పాడుతూ
శివుడచ్చే యాల్లాయ్యే సందమామంటూ
కట్టకింది చెరువులో బతుకమ్మలను అంపగ
గౌరమ్మను పూసుకొని, వాయినం ఇచ్చుకొని..
మల్లేడాదికి కలుద్దాం వదిన అంటే..
మా ఊరి చెరువు బతుకమ్మలను
ఉయ్యాలూపి నిదురబుచ్చిరి..
– తుమ్మల కల్పనారెడ్డి
96404 62142