హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. ఈ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించి, ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిసింది. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డగా, ఈ ప్రాంత అధికారిగా, ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామి కావడాన్ని, ఏడేండ్లుగా సిద్దిపేట జిల్లాలో పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రతి కార్యక్రమానికి సిద్దిపేట ఒక ప్రయోగశాలగా మారిందని గుర్తుచేశారు.
అత్యంత వేగంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేయడం, జిల్లాలో 9 వేల కుటుంబాలకు దేశంలోనే మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందజేయడం ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. అధికారిగా 26 ఏండ్ల అనుభవంలో ఎన్నో ప్రభుత్వాలను చూశానని, గత ఏడేండ్లను మాత్రం జీవితంలో మరిచిపోలేనని చెప్పారు. తెలంగాణ పాలనా బాధ్యతలను సీఎం కేసీఆర్ తీసుకొని దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టేదిశగా అహర్నిషలు కృషి చేశారని చెప్పారు. ఫలితంగా దేశంలోని అన్ని రాష్ర్టాలు ఇప్పుడు తెలంగాణవైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలనే ఉద్దేశంతోనే పదవికి రాజీనామా చేశానని, టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు ప్రకటించారు.