సిటీబ్యూరో, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): వ్యక్తిగత లాభాల కోసమే పోచారంలో కాల్పుల ఘటన జరిగిందని, కాల్పుల్లో గాయపడిన యువకుడిని వెంటనే చికిత్సకు తరలించి, నిందితుడిని 12 గంటల్లో పట్టుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. గురువారం ఎల్బీనగర్లోని క్యాంప్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాల్పుల ఘటనకు సంబం ధించిన వివరాలను వెల్లడిస్తూ, నిందితులను మీడిమా ముందు ప్రవేశపెట్టారు.
బండ్లగూడకు చెందిన మహ్మద్ ఇబ్రహీం ఖురేషి(24) , షాబాద్‌కు చెందిన కుర్వ శ్రీనివాస్, హసాన్బిన్ మోసిన్, కలాపత్తర్కు చెందిన హస్సాన్బిన్ మోసిన్, రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ హనీఫ్ ఖురేష్లు గ్యాంగ్‌గా ఏర్పడి.. పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నారు. అయితే.. కీసర, రాంపల్లి ప్రాంతంలో నివాసముండే ప్రశాంత్ కుమార్ అలియాస్ సోనుసింగ్ గో రక్షక్ దళ్ యాక్టివిస్ట్‌గా పనిచేస్తూ.. గోవుల అక్రమ తరలింపును అడ్డుకుంటూ పోలీసులకు సమాచారం ఇస్తుంటాడు. ఇతని వల్ల ఇబ్రహీంకు కోటి రూపాయల వరకు నష్టం వచ్చింది. దీంతో సోనుసింగ్పై కక్ష పెంచుకున్నాడు.
నిందితుల్లో ఒకడైన శ్రీనివాస్‌కు.. సోనుసింగ్‌తో స్నేహం ఉంది. ఈ క్రమంలో బుధవారం ఇబ్రహీంకు సంబంధించిన విషయం మాట్లాడి సెటిల్చేద్దామని చెప్పి..శంషాబాద్ వైపు రావాలని సూచించగా.. అక్కడ కాదు ఘట్‌కేసర్‌వైపు రావాలని సోనుసింగ్ సూచన చేశా డు. దీంతో బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఘట్కేసర్లోని యమ్నంపేట్‌లోని హోటల్ వద్దకు ఇబ్రహీం, హనీఫ్ ఖురేషి, హస్సాన్, శ్రీనివాస్‌లు సోన్సింగ్ను పిలిపించగా.. సుమారు గంటసేపు మాట్లాడుకున్నారు.
అక్కడి నుంచి కొద్దిదూరంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోని వెంచర్లోకి వెళ్లి మాట్లాడుకున్నారు. మాటల సందర్భంగా కోటి రూపాయల నష్టం జరిగిందంటూ ఇబ్రహీం ప్రస్తావించగా.. సోనుసింగ్ రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో వారిమధ్య మాటా మాట పెరగడంతో ఇబ్రహీం తన వెంట తెచ్చుకున్న కంట్రీమేడ్ పిస్టోల్‌తో ఒక రౌండ్ కాల్పులు జరిపి పరారయ్యాడు. సోనుసింగ్కు బుల్లెట్ గాయం అయింది. అతను స్నేహితులకు ఫోన్‌చేయగా..వారు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే బాధితుడిని సికింద్రాబాద్‌లోని ప్రైవేటు దవాఖానకు తరలించా రు. బాధితుడి పక్కటెముకలోకి బుల్లెట్ దిగగా వైద్యులు బయటకు తీశారని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. హనీఫ్ ఖురేషి పరారీలో ఉన్నాడు. కాగా.. ఇబ్రహీంపై ఈ ఏడాది ములుగు, గజ్వేల్, శంషాబాద్ రూరల్, ఘట్కేసర్లో కేసులు నమోదు కాగా 2024లో శంషాబాద్ రూరల్, 2022లో కమాటిపురాలో కేసులు నమోదుకావడంతో పాటు అక్రమ రవాణాకు సంబంధించిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.