భటిండా: పంజాబీ సింగర్ సిధ్దూ మూసేవాలాను హత్య చేసిన కేసులో షార్ప్ షూటర్ హర్కమల్ రానూను అరెస్టు చేశారు. భటిండాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. హర్కమల్ను పోలీసులకు అప్పగించినట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు. మూసేవాలాను హత్య చేసిన 8 మంది షూటర్లలో హర్కమల్ ఒకడు. కానీ ఆ హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని హర్కమల్ చెప్పినట్లు అతని తాతయ్య గురుఛరణ్ సింగ్ వెల్లడించాడు.
మూసేవాలా హత్య కసులో ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది. సతిందర్‌జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పేరుమీద ఆ నోటీసులు జారీ అయ్యాయి. సిద్దూ మూసేవాలాను తానే చంపినట్లు గోల్డీ బ్రార్ బాధ్యత తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కెనడాలో ఉంటున్నాడతను. మరో రెండు కేసుల్లో బ్రార్‌కు పంజాబ్ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. 2017లో స్టూడెంట్ వీసాపై కెనడా వెళ్లిన బ్రార్ ఆ తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా మారాడు.
గత ఏడాది హత్యకు గురైన అకాళీదళ్ యువ నేత విక్కీ మిడ్డుకేరాకు ప్రతీకారంగా మూసేవాలాను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిద్దూ మర్డర్ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూసేవాలా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. మన్సా జిల్లాలో అతన్ని ఇటీవల కొందరు కాల్చి చంపారు. అతని వాహనం వద్ద 30 ఖాళీ బుల్లెట్ కేస్‌లను గుర్తించారు.