బంతిని గింగిరాలు తిప్పగల మాంత్రికుడు..లెగ్‌సైడ్ బాల్ వేసి ఆఫస్టంప్ గిరాటేయగల ఇంద్రజాలికుడు..స్పిన్నర్లకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన వీరుడు..
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూశారు. తన దేశానికే చెందిన సీనియర్ క్రికెటర్ రాడ్ మార్ష్ మృతికి సంతాపం తెలిపిన వార్న్.. కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆటతో పాటు హవభావాలు, ఆహార్యం, ఆలోచనలతో యావత్ క్రీడాలోకాన్ని దశాబ్దంన్నర పాటు మంత్రముగ్ధుల్ని చేసిన షేన్ కీత్ వార్న్ శుక్రవారం అందరికీ అల్విదా అంటూ వెళ్లిపోయారు. లెగ్ స్పిన్‌కు వన్నెతెచ్చిన వీరుడా.. నీ ఘనతలు అధిగమించేందుకైనా మళ్లీ రావా!!
మెల్బోర్న్: స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ (52) కన్నుమూశారు. అంతుచిక్కని బంతులతో ప్రపంచాన్ని గడగడలాడించిన వార్న్.. గుండెపోటుకు గురై శుక్రవారం మృతిచెందారు. థాయ్‌లాండ్‌లోని తన గదిలో అచేతనంగా పడి ఉండటాన్ని గుర్తించిన విల్లా సిబ్బంది వార్న్‌ను దవాఖానకు తరలించగా.. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రాథమికంగా ధృవీకరించారు. ఆస్రేలియా దిగ్గజ క్రీడాకారుడు రాడ్ మార్ష్ మృతికి సంతాప ట్వీట్ చేసిన వార్న్.. కాసేపటికే తిరిగి రాని లోకాలకు తరలి వెళ్లడం గమనార్హం. 1992లో తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన వార్న్.. దాదాపు 15 ఏండ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్లో ఏకఛత్రాదిపత్యం కొనసాగించారు. ఆసీస్ తరఫున 145 టెస్టులాడిన వార్న్ 25.41 సగటుతో 708 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తన కెరీర్లో 37 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన షేన్. పది సార్లు పది వికెట్లు పడగొట్టారు. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (800) తర్వాత వార్న్ రెండో స్థానంలో ఉన్నారు. వన్డేల విషయానికి వస్తే 194 మ్యాచ్‌ల్లో 25.73 సగటుతో 293 వికెట్లు పడగొట్టారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్లో అనామక ఆటగాళ్లతో నిండిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తూ ట్రోఫీ చేజిక్కించుకున్న వార్న్ 2013లో ఆటలోని అన్నీ ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్న వార్న్ హఠాన్మరణం క్రీడాలోకాన్ని కలచివేసింది. ఐసీసీ, బీసీసీఐ మొదలు ఆటగాళ్లంతా వార్న్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న వార్న్.. ప్రతిష్ఠాత్మక విజ్డన్ శతాబ్దపు అత్యుత్తమ ఐదుగురు ఆటగాళ్లలో ఒకడిగా నిలిచారు. యాషెస్ సిరీస్‌ల్లో మరే బౌలర్‌కు సాధ్యంకాని రీతిలో 195 వికెట్లు తీసిన వార్న్.. 1999లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించారు. మైదానం లోపలా, బయటా ఎప్పుడూ వార్తల్లో నిలువాలనే వ్యక్తిత్వం ఉన్న వార్న్ కెరీర్లో మరకలకు కొదవే లేదు. బ్యాడ్‌బాయ్‌గా ఖ్యాతికెక్కిన వార్న్.. మ్యాచ్ ఆరంభానికి ముందే పిచ్ రిపోర్ట్ బుకీలకు అందించి ఓసారి సస్పెండ్ అయ్యాడు. ఇక 2003 ప్రపంచకప్‌నకు ముందు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిన షేన్ ఆటకే దూరమయ్యాడు. ఎన్ని తప్పులు చేసినా.. అతడి లెగ్ బ్రేక్‌లో ఉన్న మ్యాజికే వార్న్‌కు అవకాశాలు కల్పించింది. లెగ్ స్పిన్‌కు వన్నెతెచ్చిన వీరుడా.. నీ ఘనతలు మేం మరవలేం!
ఈ సందర్భంలో మాటలు రావడం లేదు. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో అర్థం కావడం లేదు. నా స్నేహితుడిని కోల్పోయాను. ఆల్‌టైమ్ అద్భుతమైన ప్లేయర్‌ను మనం చేజార్చుకున్నాం. వార్న్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
– బ్రియాన్ లారా
జీవితం చాలా చంచలమైంది, ఊహించలేనిది. క్రికెట్ అత్యుత్తమ ప్లేయర్‌ను కోల్పోయింది. దిగ్గజ క్రికెటర్ ఆత్మకు శాంతి చేకూరుగాక.
– విరాట్ కోహ్లీ
షాకింగ్! అతడికి నా నివాళులు. క్రికెట్లో అత్యుత్తమ లెగ్స్పిన్నర్లలో వార్న్ ఒకడు. అతడో దిగ్గజం. వార్న్ ఆత్మకు శాంతి చేకూరు గాక
-మంత్రి కేటీఆర్
వార్నీ నిన్ను చాలా కోల్పోతున్నాం. నువ్వు పక్కన ఉండగా ఎప్పుడూ నిరుత్సాహం లేదు. అది మైదానంలోనైనా, బయటైనా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపాం. మైదానంలో మన మధ్య పోరాటం, బయట స్నేహపూర్వక పోటీ ఎన్నటికీ మరిచిపోలేనిది. భారత్ నీకు ప్రత్యేకమైన స్థలం. చాలా తొందరగా వెళ్లిపోయావు.
-సచిన్ టెండూల్కర్
వార్న్ జర్నీ పూర్తి పేరు షేన్ కీత్ వార్న్
పుట్టిన తేదీ సెప్టెంబర్: 13, 1969
టెస్టులు :145
వికెట్లు :708
సగటు :25.41
ఐదు వికెట్లు : 37
పది వికెట్లు : 10
వన్డేలు :194
వికెట్లు :293
సగటు :25.73