ముంబై, ఆగస్టు 16: దేశీయ స్టాక్ మార్కె ట్లు రివ్వున ఎగిశాయి. అమెరికా ఆర్థిక మాంద్యం భయాలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పోటెత్తాయి. ఒక దశలో 1,400 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 1,330.96 పాయిం ట్లు లేదా 1.68 శాతం లాభపడి 80,436.84 వద్ద ముగిసింది. గడిచిన రెండు నెలల్లో ఒక్కరోజు ఈ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. మరో సూచీ నిఫ్టీ సైతం 397.40 పాయింట్లు లేదా 1.65 శాతం అందుకొని 24,531.15 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్లు రివ్వున ఎగరడంతో మదుపరుల సంపద దూసుకుపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.7,30,389.86 కోట్లు పెరిగి రూ.4,51,59,833.55 కోట్లు (5.38 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది.
బ్యాంకింగ్, ఐటీ షేర్లలో జోష్
ఐటీ రంగ షేర్లతోపాటు బ్యాంకింగ్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 2.17 శాతం లాభపడింది. దీంతోపాటు ఇండస్ఇండ్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కొటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, యెస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్లు లాభాల్లో ముగిశాయి. వీటితోపాటు టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్లు అత్యధికంగా లాభపడిన షేర్లలో ఉన్నాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 2.72 శాతం లాభపడగా, రియల్టీ 2.45 శాతం, టెక్ 2.23 శాతం, ఆటో 1.90 శాతం, కమోడటీస్ 1.89 శాతం, పవర్ 1.80 శాతం, ఆర్థిక సేవలు 1.77 శాతం పెరిగాయి.
పుంజుకోవడానికి కారణాలు
ఆర్థిక మాంద్యం భయాలు చుట్టుముట్టిన అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుండటం.
వచ్చే నెల సమీక్షలోనే అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం మదుపరుల్లో జోష్ పెంచింది.