హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఫస్టియర్లో మరో 52,302 సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడతలో 39,101 సీట్లు భర్తీ కాగా, రెండో విడతలో 52వేల సీట్లు నిండాయి. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) రెండో విడత సీట్లను శనివారం కేటాయించారు. రెండో విడతలో 60,439 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, 52వేల మందికి పైగా సీట్లు దక్కించుకున్నట్టు దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నా 8,137 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకోలేదని తెలిపారు. వీరు తక్కువ వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నందున సీట్లు దక్కించుకోలేకపోయారని వెల్లడించారు. సీట్లు పొందిన వారు జూన్ 5లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.