Savitri| సావిత్రి అంటే మహానటి.. మహానటి అంటే సావిత్రి. కొన్ని దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఈ మహానటి అప్పట్లో చాలా మంది హీరోలతో కలిసి పని చేసింది. సావిత్రికి ముందు తర్వాత కూడా చాలా మంది హీరోయిన్స్ వచ్చిన కూడా మహానటి అనిపించుకుంది మాత్రం కేవలం సావిత్రి మాత్రమే. కథ ఏదైన సరే సావిత్రి ఉంటే ఒక నిండుదనం ఉంటుందని చాలా మంది నిర్మాతలు ఆమె కాల్షీట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్టార్ హీరోలను మించిన ఇమేజ్‌తో రాణించిన సావిత్రి సౌత్ ఇండస్ట్రీలో ఓ సంచలనం. ప్రతి సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించే సావిత్రి ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించింది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.
నాటకాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి 1949లో సినిమా ఛాన్స్ అందుకుంది. అయితే చిన్న పిల్లగా ఉందని ఆమెని రిజెక్ట్ చేశారు. అనంతరం సంసారం చిత్రంతో వెండితెరకి పరిచయం అయింది. అయితే పాతాళ భైరవి`లో డాన్స్ చేసే అవకాశం ఉందని తెలిసి ఎన్టీఆర్, ఎస్వీఆర్, మాలతి కలిసి నటించిన సినిమాలో నర్తకిగా నటించింది సావిత్రి. అప్పట్లో నర్తకి అంటే ఇప్పుడు ఐటెమ్ గర్ల్ అని చెప్పొచ్చు. `పాతాళభైరవి`లో ఆమె నర్తకిగా డాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. `రానంటే రానే పాటలో డాన్స్ చేసిన సావిత్రికి మంచి పేరు వచ్చింది.
ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపడంతో సావిత్రి జాతకం మారిపోయిందని చెప్పవచ్చు. ఇక ఆమెకి వరుస ఆఫర్లు వచ్చాయి. పెళ్లి చేసిచూడు సినిమాతో నటిగా బ్రేక్ రాగా, దేవదాసు తో మాత్రం ఇక స్టార్ అయిపోయింది. సావిత్రి అప్పట్లో వరుసగా మూడు షిఫ్ట్ ల్లో మూడు సినిమాలు చేసి అందరిని ఆశ్చర్యపరచింది. ఈ క్రమంలో ఎన్టీఆర్, ఏఎన్నార్లకు దీటుగా ఎదిగింది. స్టార్ హీరోలని మించి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే జీవితంలో చేజేతులారా చేసిన కొన్ని తప్పుల వలన కెరీర్ నాశనం అయింది. మధ్యలో మద్యంకి అలవాటు పడి చివరికి కోమాలోకి వెళ్లి చనిపోయిన విషయం తెలిసిందే.