న్యూఢిల్లీ: ఆసియా కప్ హాకీ టోర్నీకి సీనియర్ గోల్ కీపర్ సవితా పునియా సారథ్యంలో భారత మహిళల జట్టు బరిలోకి దిగనుంది. మస్కట్ వేదికగా ఈనెల 21-28 మధ్య జరుగనున్న టోర్నీ కోసం బుధవారం 18 మందితో కూడిన జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ రాణిరాంపాల్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో సవితకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. పూల్ ‘ఏ’లో ఉన్న భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఈనెల 21న మలేషియాతో..జపాన్‌తో(23న), సింగపూర్(24న)తో తలపడనుంది. సీనియర్ ప్లేయర్ దీప్ గ్రేస్ ఎక్కా ఉప సారథ్యం వహించనుండగా.. జట్టుకు ఎంపికైన వారిలో 16 మంది టోక్యో ఒలింపిక్స్‌లో ఆడినవారే ఉండడం విశేషం. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన నాలుగు జట్లు ఈ ఏడాది జరిగే హాకీ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి.
భారత జట్టు.. గోల్ కీపర్స్: సవిత, రజనీ; డిఫెండర్స్: దీప్ గ్రేస్, గుర్జిత్ కౌర్, నిక్కీ ప్రధాన్, ఉదిత; మిడ్ఫీల్డర్స్: నిషా, సుశీల, మోనిక, నేహా, సలీమా, జ్యోతి, నవ్‌జ్యోత్ కౌర్, ఫార్వర్డ్స్: నవ్‌నీత్‌కౌర్, లాల్రెసియామి, వందన, మరియన, షర్మిల.