మారేడ్‌పల్లి, డిసెంబర్ 18 : భవిష్యత్‌లో వివిధ రంగాల్లో రోబొటిక్స్ కీలక పాత్ర పోషించనున్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. భారత ఫోర్జ్ లిమిటెడ్ సహకారంతో ఎంసీఈఎంఈ ( మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు రోబోథాన్ పేరిట ఇంటర్ కాలేజ్ రోబోటిక్స్ పోటీలు-2021 నిర్వహించారు. శనివారం ఈ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమం తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రక్షణ, వైద్య రంగంలో రోబొటిక్స్ కీలకంగా మారతాయన్నారు.
పాత వాటి నుంచే కొత్త విషయాలను ఆకలింపు చేసుకుంటూ నూతన ఆవిష్కరణల తయారు చేయవచ్చని సూచించారు. ఈ ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎంసీఈఎంఈ బృందం, ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీల బృందాలకు గవర్నర్ నగదు పురస్కారాలతో పాటు హైదరబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ బృందానికి కన్పొలేషన్ బహుమతిని అందజేశారు.
ఈ పోటీల్లో విజేతలను త్వరలోనే రాజ్‌భవన్‌కు పిలిపించి స్వయంగా తానే సన్మానిస్తానని ఆర్మీ అధికారుల ద్వారా వెల్లడించడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రోబో ప్రదర్శనను లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణన్‌తో కలిసి తిలకించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ విద్య, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్, కల్యాణి రఫీల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఎండీ, సీఈవో రుద్ర బీ జడేజా తదితరులు పాల్గొన్నారు.