హైదరాబాద్, ఆగస్టు 16(నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన గురువు చంద్రబాబు అడుగు జాడల్లోనే నడుస్తున్నారని మరోసారి రుజువైంది. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ కూడా అచ్చం అలాగే చేస్తున్నారు. ఇందుకు రెడ్ డైరీ వ్యవహారమే ఉదాహరణ. అక్కడ తమ విధులు నిర్వహిస్తున్న అధికారులను భయభ్రాంతులకు గురిచేసేలా రెడ్ డైరీ పేరుతో అధికారుల పేర్లు రాసిపెడుతాన్నమని, తాము అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తామంటూ చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. అచ్చం అలాగే ఇక్కడ కూడా గురువు బాటలోనే నడుస్తూ రేవంత్రెడ్డి కూడా రెడ్ డైరీ విధానాన్ని అమలు చేస్తున్నారు. మంగళవారం పోలీసులను బట్టలూడదీసి కొడతామని, రెడ్ డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నామంటూ రేవంత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ విధంగా అక్కడ చంద్రబాబు, లోకేష్.. ఇక్కడ రేవంత్రెడ్డి రెడ్ డైరీని చూపుతూ ఉద్యోగులను భయపెట్టేలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుతో తనకేమి సంబంధం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కే రేవంత్రెడ్డి ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.