
మెదక్, డిసెంబర్ 9 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 463మంది పోలీసు సిబ్బంది భద్రత నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డిలో 4, మెదక్‌లో 3, సిద్దిపేటలో 2 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందన్నారు. మొ త్తం 1026 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని, ఇందులో 454 మంది పురుషులు, 572 మంది మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. వీరిలో 13 మంది ఎక్స్అఫీషియోలుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉంటారన్నారు. కాగా, పోలింగ్ ప్రక్రియలో 75 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
ఈ నెల 14న కౌంటింగ్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్‌ను ఈ నెల 14న మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఉద యం 10గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. నాలుగు టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలో భద్రపర్చడం జరుగుతుందన్నారు. ఇందుకోసం పోలీసు బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశారన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా ఎన్నికల సహాయ అధికారి రమేశ్, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, ఆర్డీవో సాయిరాం, తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.