హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి వరుస రాజీనామాలు కోలుకోలేని ఝలక్ ఇస్తున్నాయి. మూడు నెలల్లోనే ముగ్గురు కీలక చైర్మన్లు తమ పదవులకు అస్త్రసన్యాసం చేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నది. రెడో చైర్మన్ శరత్, రెరా చైర్మన్ సత్యనారాయణ, తాజాగా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తమ పదవీకాలం ముగియకుండానే అర్ధాంతరంగా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి, ఈ కీలక పదవుల్లో ఉన్న ప్రముఖులకు మధ్య అసలు పొసగడం లేదనేది బహిరంగ రహస్యంగా మారింది.
ప్రజాప్రయోజనాల కోసం, వ్యవస్థల బలోపేతం కోసం వారు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు, అసంతృప్తి, ప్రతిపాదనలకు కనీస గౌరవం దకడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తమ సలహాలను బేఖాతరు చేస్తుండటంతో, పదవుల్లో ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వారు ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రజలకు, వ్యవస్థలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవులు ఎందుకు అన్న భావనతోనే పదవులకు రాజీనామాలు చేస్తున్నట్టు సమాచారం.
ఈ రాజీనామాల పర్వానికి తెరవెనుక కొందరు కీలక ఐఏఎస్ల పెత్తనమే ముఖ్య కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోని కొద్దిమంది ఉన్నతాధికారుల గుత్తాధిపత్యం, మితిమీరిన జోక్యం కారణంగానే ఆయా చైర్మన్లు పని చేయలేక, ఉద్దేశపూర్వకంగానే తమకు పొగబెట్టారని భావించి స్వచ్ఛందంగా తప్పుకొంటున్నారనే ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఆకునూరి మురళి విషయంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో పొసగకనే రాజీనామా చేసినట్టు అధికార వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
పదవీకాలం ఇంకా కొన్ని నెలలు మిగిలి ఉండగానే, కనీసం ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే వాతావరణం లేకపోవడంతోనే కొందరు తప్పుకొన్నట్టు స్పష్టమవుతున్నది. ముఖ్యంగా రెడో చైర్మన్ శరత్ ఆ పోస్టులో తనను నియమించిన కొద్దిరోజులకే బాధ్యతల నుంచి తప్పుకోవడం ఈ అసంతృప్తికి పరాకాష్టగా నిలిచింది. ఆయన తన పదవికి రాజీనామా చేసిన ఏపీకి వెళ్లిపోయారు. అక్కడి తిరుమల తిరుపతి దేవస్థానంలో బాధ్యతలు చేపట్టారు. ఈ వరుస రాజీనామాల పర్వం ప్రభుత్వ తీరు, అంతర్గత సమన్వయ లోపాలను ఎత్తిచూపుతున్నది.