షార్జా: ఐపీఎల్ ఎలిమినేటర్‌లో భారీ అంచనాలతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్వల్పస్కోరుకే పరిమితమైంది. స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్ దెబ్బకు బెంగళూరు మిడిలార్డర్ కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేనకు శుభారంభమే లభించింది. పడిక్కల్ (21), కోహ్లీ (39) మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ జోడీని లోకీ ఫెర్గూసన్ విడగొట్టాడు. అతని బౌలింగ్‌లో పడిక్కల్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తర్వాత కోహ్లీతోపాటు వరుసగా శ్రీకర్ భరత్ (9), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (15), ఏబీ డివిలియర్స్ (11) వంటి ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్ అందరినీ పెవిలియన్ చేర్చిన నరైన్.. కోల్‌కతాకు బ్రేక్ ఇచ్చాడు. అనంతరం షాబాజ్ అహ్మద్ (13)ను ఫెర్గూసన్ పెవిలియన్ చేర్చాడు. డాన్ క్రిస్టియన్ (9) రనౌట్‌గా వెనుతిరిగాడు. హర్షల్ పటేల్ (8), జార్జ్ గార్టన్ (0) నాటౌట్‌గా నిలిచారు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో నరైన్ 4, ఫెర్గూసన్ 2 వికెట్లు కూల్చారు.