కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ అదిరిపోయే బోణీ కొట్టింది. చండీగఢ్‌పై 217 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 401 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భాగంగా ఓవర్‌నైట్ స్కోర్ 21/2తో ఆఖరి రోజైన ఆదివారం చండీగఢ్ బ్యాటింగ్‌కు దిగింది. యువ పేసర్ రవితేజ(6/41) ఆరు వికెట్లతో విజృంభించాడు. చురకత్తుల్లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. పిచ్ పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ సరుల్ కన్వర్(4)తో మొదలైన రవితేజ జోరు ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగింది. ఈ యువ పేసర్ ధాటికి ఓపెనర్ ఖాన్(68) మినహా అందరూ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. అంకిత్ కౌశిక్ (32), రాజ్ బవా (35 నాటౌట్) ప్రతిఘటించినా లాభం లేకపోయింది. రవితేజకు తోడు రక్షణ్‌రెడ్డి(3/62) కూడా జతకలువడంతో చండీగఢ్ ఆటలు సాగలేదు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రవితేజ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. భారీ విజయం సాధించిన హైదరాబాద్ ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి. తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 24 నుంచి బెంగాల్‌తో హైదరాబాద్ తలపడనుంది.
మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు రాజస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో రాజస్థాన్ 275 పరుగులు చేయగా.. ఆంధ్ర జట్టు 224కే ఆలౌటైంది. రాజస్థాన్ 316 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ముగించి ఆంధ్రకు 368 పరుగుల భారీ లక్ష్యం విధించింది. 209కే ఆలౌటై ఆంధ్ర ఓటమి వైపు నిలబడగా.. 158 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది.
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 347 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 269/8 డిక్లేర్డ్. చండీగఢ్ తొలి ఇన్నింగ్స్: 216 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్: 183 ఆలౌట్