Ravi Teja | మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా, సుధాకర్ చెరుకూరి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు హరీశ్ శంకర్, బాబీ, శివ నిర్వాణ తదితర సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. స్టేజ్‌పై కనిపించిన సందడి, అభిమానుల హంగామా ఈ సినిమా మీద ఉన్న క్రేజ్‌ను మరోసారి చాటిచెప్పింది.
సినిమా కథ విషయానికి వస్తే, ఇద్దరు మహిళల మధ్య చిక్కుకున్న ఓ వ్యక్తి చుట్టూ తిరిగే సరదా సంఘటనలను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా మలిచినట్లు ట్రైలర్‌నే స్పష్టం చేసింది. కిశోర్ తిరుమల తనదైన శైలిలో కామెడీకి భావోద్వేగాల టచ్ జోడించి కథను రూపొందించారని చిత్ర యూనిట్ చెబుతోంది. రవితేజ ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో పాటు హీరోయిన్ల గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల విజువల్స్, భీమ్స్ అందించిన పాటలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు ప్లస్‌గా మారనున్నాయని టాక్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది స్టేజ్‌పై జరిగిన తీన్మార్ డాన్స్. రవితేజ, దర్శకుడు కిశోర్ తిరుమల, హీరోయిన్లు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి కలిసి వేసిన స్టెప్పులు హాల్ మొత్తాన్ని ఉత్సాహంతో నింపాయి. ముఖ్యంగా రవితేజ, కిశోర్ తిరుమల ఎనర్జీ లెవెల్స్ అందరినీ ఆకట్టుకోవడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందడి చూసిన అభిమానులు సినిమాలో కూడా ఇలాంటి మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రవితేజ, సినిమాలో తాను ఆషికా, డింపుల్‌తో చేసిన అల్లరి ఎలా ఉంటుందో థియేటర్లలోనే చూడాలని అన్నారు. తనను ఈ సినిమాలో మరింత స్టైలిష్‌గా చూపించిన ఘనత పూర్తిగా సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లకే దక్కుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. హిట్–ఫ్లాప్‌లకు అతీతంగా కొంతమంది దర్శకులతో పనిచేయడాన్ని తాను ఎంతో ఆస్వాదిస్తానని, కిశోర్ తిరుమలతో కలిసి ఈ సినిమా చేయడం ప్రత్యేక అనుభూతిగా మారిందని తెలిపారు. దర్శకుడు కిశోర్ తిరుమల కూడా మాట్లాడుతూ, ఈ సినిమా కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందించామని, సంక్రాంతి పండుగకు మంచి వినోదం అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించిన ఉత్సాహం, స్టేజ్‌పై జరిగిన డాన్స్ హంగామా సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Team #BharthaMahasayulakuWignyapthi just rocking at the grand pre-release event 🔥🔥 pic.twitter.com/U76rencl7i
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 10, 2026