Ratings | తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో ఫేక్ రివ్యూలు, ఉద్దేశపూర్వక నెగిటివ్ రేటింగ్స్‌పై చర్చ తీవ్రస్థాయికి చేరింది. ఒక సినిమా విడుదలైన వెంటనే దాని కథ, నటన, టెక్నికల్ విలువల కంటే ముందే సోషల్ మీడియాలో విమర్శల తుఫాన్ మొదలవడం ఇప్పుడు సాధారణమైపోయింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలను టార్గెట్ చేస్తూ యాంటీ ఫ్యాన్ గ్రూపులు నడిపే దుష్ప్రచారం, చిన్న సినిమాలకు మరింత నష్టం కలిగిస్తోందన్న ఆరోపణలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇటీవల ఈషా సినిమా నిర్మాతలు బహిరంగంగా స్పందించడంతో ఈ అంశం మరింత చర్చకు వచ్చింది. కొన్ని దేశాల్లో ఇంకా విడుదల కాని సినిమాలకు కూడా ముందే నెగిటివ్ రేటింగ్స్ రావడం వెనుక కొన్ని గ్రూపులు ఉన్నాయనే అనుమానాలను వారు వ్యక్తం చేశారు.
థియేటర్లలో హౌస్‌ఫుల్స్ నడుస్తున్నప్పటికీ, ఆన్లైన్ ప్లాట్‌ఫాంలలో మాత్రం కావాలని తక్కువ రేటింగ్స్ వేయడం ద్వారా ప్రేక్షకులను ప్రభావితం చేసే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు. ముఖ్యంగా సినిమా చూడకుండానే బుకింగ్ యాప్స్‌లో రేటింగ్ ఇచ్చే వెసులుబాటు పెద్ద సమస్యగా మారిందని నిర్మాతల అభిప్రాయం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు పరిశ్రమలో కొత్త ప్రయోగానికి రంగం సిద్ధమవుతోంది. ఫేక్ రివ్యూలు, పెయిడ్ నెగిటివిటీకి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ‘బ్లాక్ బిగ్’, ‘అప్లిక్స్’ అనే రెండు యాంటీ పైరసీ ఆధారిత యాప్స్‌ను రివ్యూ–రేటింగ్ వ్యవస్థతో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. ఈ కొత్త విధానంలో సినిమా చూసిన ప్రేక్షకుల వేరీఫైడ్ డేటా ఆధారంగానే రేటింగ్స్, రివ్యూలు కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో డబ్బులు ఇచ్చి చేయించే కామెంట్లు, ఒకే గ్రూప్ ద్వారా భారీగా తక్కువ రేటింగ్స్ వేయించే అవకాశాలకు చెక్ పడుతుందని సమాచారం.
ఈ విధానాన్ని ముందుగా చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. బుకింగ్ పార్ట్నర్ ప్లాట్‌ఫాంలలో కావాలని రేటింగ్స్‌ను మానిప్యులేట్ చేయడం ఇకపై సాధ్యం కాదని, ప్రేక్షకుల నుంచి వచ్చిన అసలైన స్పందనే బయటకు వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. దీని వల్ల కంటెంట్ బలంగా ఉన్న సినిమాలకు, ముఖ్యంగా చిన్న మరియు మధ్య స్థాయి బడ్జెట్ చిత్రాలకు పెద్ద ఊరట లభించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్డ్ ఆఫ్ మౌత్‌కు ప్రాధాన్యం పెరిగి, కృత్రిమ నెగిటివిటీ ప్రభావం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ మార్పు అన్ని వర్గాలకు అనుకూలమేనా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇప్పటివరకు కొంతమంది నిర్మాతలు డీలింగ్స్ ద్వారా తమ సినిమాలకు అధిక పాజిటివ్ రేటింగ్స్ వేయించుకుని హైప్ క్రియేట్ చేసిన సందర్భాలున్నాయి. కొత్త వ్యవస్థ అమలులోకి వస్తే ఫేక్ నెగిటివిటీతో పాటు ఫేక్ పాజిటివిటీకి కూడా గట్టి బ్రేక్ పడనుంది.