Ramayana Movie | బాలీవుడ్ నుంచి రాబోతున్న అంత్యంత ప్రతిష్ఠాత్మాక పౌరాణిక చిత్రం ‘రామాయణం’ (Ramayana) సినిమాకు సంబంధించి రోజుకో కొత్త వార్త అభిమానులను ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సంగీత హక్కుల వార్తలు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ (A.R. Rahman), హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్ (Hans Zimmer) సంయుక్తంగా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ బిగ్ కాంబో కారణంగా సినిమా మ్యూజిక్ హక్కులపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిత్ర నిర్మాతలు ఈ సినిమా సంగీత హక్కుల కోసం దాదాపు రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అంత భారీ ధర పలుకుతుండండంతో పలు మ్యూజిక్ సంస్థలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ రేసులో ప్రముఖ ఆడియో కంపెనీ సోని మ్యూజిక్ (Sony Music) సంస్థ సుమారు రూ. 70 కోట్ల బిడ్‌తో ముందువరుసలో నిలిచినట్లు నివేదికలు వెల్లడించాయి.
అయితే, ఈ మ్యూజిక్ హక్కుల కోసం జరిగిన పోటీలో చివరకు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘టి-సిరీస్’ (T-Series) సంస్థ ముందుకొచ్చి, రామాయణం (పార్ట్ 1 మరియు పార్ట్ 2) రెండింటికి కలిపి రూ. 75 కోట్ల భారీ అడ్వాన్స్ మొత్తంతో ఆడియో రైట్స్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ డీల్ నిజమైతే బాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డుగా ఇది నిలవనుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణాసుడిగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా దృశ్యకావ్యంలో సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు నితీష్ తీవారి దర్శకత్వం వహిస్తుండగా.. నమీత్ మల్హోత్ర రూ.4000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.