సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుందని.. అందుకే అన్ని విషయాల్ని రహస్యంగా దాచిపెట్టడం కుదరదని చెప్పింది పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్. నెల రోజుల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌మీడియా ద్వారా తన ప్రేమ వ్యవహారం గురించి వెల్లడించిందీ సుందరి. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. ప్రియుడితో కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా పంచుకుంది. మనసుకు ప్రశాంతత చేకూర్చి ఆనందింపజేసే విషయాల్ని అందరికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో తన ప్రేమ వ్యవహారం గురించి బయటపెట్టానని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది.
‘ప్రేమ ప్రయాణాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్నా. అదొక అందమైన అనుభవం. అందుకే సోషల్‌మీడియా ద్వారా అందరికి చెప్పాలనుకున్నా. నా గురించి ఏవో ఊహాగానాలు చేస్తూ చర్చించుకోవడం ఇష్టం ఉండదు. ఇక నుంచి ఏ విషయాన్నైనా నేనే స్వయంగా వెల్లడిస్తా’ అని రకుల్‌ప్రీత్‌సింగ్ చెప్పింది. ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టిపెడుతున్నానని, పెళ్లికి చాలా సమయం ఉందని ఆమె స్పష్టం చేసింది. పెళ్లి కుదిరితే తానే ముందుగా ఆ శుభవార్తను అభిమానులతో పంచుకుంటానని రకుల్‌ప్రీత్‌సింగ్ తెలిపింది. ప్రస్తుతం ఈ సుందరి హిందీలో ఆయుష్మాన్‌ఖురానా సరసన ‘డాక్టర్-జీ’ చిత్రంలో నటిస్తున్నది.