సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పబోతున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తలైవా అభిమానులకు ఇంతకు మించిన చేదువార్త మరొకటి ఉండదు. ప్రస్తుతం తమిళనాట ఈ వార్త దావానలంలా వ్యాపించింది. ‘జైలర్ 2’ షూటింగ్లో ప్రస్తుతం తలైవా బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సుందర్.సి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారాయన. ఆ సినిమా తర్వాత కమల్‌హాసన్‌తో చేసే సన్సేషనల్ మల్టీస్టారర్‌తో సినిమాలకు స్వస్తి పలకాలని రజనీకాంత్ భావిస్తున్నారట.
1975లో ‘అపూర్వరాగంగళ్’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన రజనీకాంత్.. ‘బిల్లా’(1980) సినిమాతో తమిళనాట సూపర్‌స్టార్‌గా అవతరించారు. 45ఏండ్లుగా తమిళనాట తిరుగులేని హీరోగా సత్తా చాటారు. ఉత్తరాదికి అమితాబ్, దక్షిణాదికి రజనీకాంత్ అనే స్థాయిలో ఆయన స్టార్డమ్ సాగింది. నేటికీ హీరోగా రజనీ హవా తగ్గలేదు. లైమ్‌లైట్‌లో ఉండగానే ఆయన రిటైర్మెంట్ వార్తలు రావడం అభిమానులకు మింగుడు పడని అంశం. మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది తెలియాల్సివుంది.