Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హారర్-కామెడీ “ది రాజా సాబ్” చిత్రం పై అంచనాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందన్న దానిపై అభిమానుల మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. దీనిపై చివరికి నిర్మాత ఎస్కేఎన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఎస్కేఎన్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఫస్ట్ సింగిల్ విడుదలలో ఆలస్యం రావడానికి కారణం ఉత్తర భారత, తెలుగు మార్కెటింగ్ టీమ్‌ల మధ్య చర్చలు అని చెప్పారు. మొదటగా ‘రెబెల్ సాబ్’ అనే ఎనర్జీటిక్ సాంగ్‌ను ముందుగా విడుదల చేయాలని అనుకున్నా, ఉత్తర భారత పంపిణీదారులు మాత్రం ముందుగా మెలోడి సాంగ్ రిలీజ్ చేయాలని సూచించారని తెలిపారు. ఈ భిన్నాభిప్రాయాల వల్లే చిన్న ఆలస్యం జరిగిందని అన్నారు.
దక్షిణ భారత మార్కెట్లో సాధారణంగా లిరికల్ వీడియోలు మాత్రమే రిలీజ్ చేసి, పూర్తి సాంగ్ వీడియోలను థియేటర్స్‌లో చూపిస్తారని, కానీ ఉత్తర భారత మార్కెట్లో మాత్రం పూర్తి వీడియో సాంగ్స్ ముందుగానే విడుదల చేస్తారని ఎస్కేఎన్ వివరించారు. ఇందుకే ఆలస్యం జరిగుతుందని తెలియజేశారు. “ది రాజా సాబ్”లో ఐటెమ్ సాంగ్ ఉండదని, అయితే ఒక పాపులర్ హిందీ సాంగ్‌ను రీమిక్స్ వెర్షన్‌గా తీస్తున్నామని నిర్మాత తెలిపారు. ప్రతి సాంగ్ రిలీజ్ మధ్య 10–14 రోజుల గ్యాప్ ఇస్తారని, ఇలా చేయడం వల్ల ప్రేక్షకులు ప్రతి సాంగ్‌ను మంచి మ్యూజిక్ అనుభవంతో ఆస్వాదించగలరని చెప్పారు.
ఎస్కేఎన్ ప్రకారం, ఫస్ట్ సింగిల్ నవంబర్ మూడో లేదా నాలుగో వారంలో విడుదల కానుంది. ఆ తర్వాత సినిమా ప్రమోషన్లు డిసెంబర్ చివరి వరకు కొనసాగుతాయి. ఈ క్రమంలో “ది రాజా సాబ్” ను 2026 జనవరి 9న, సంక్రాంతి సీజన్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి, “ది రాజా సాబ్” ఫస్ట్ సింగిల్‌పై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. నిర్మాత ఎస్కేఎన్ ఇచ్చిన తాజా అప్డేట్తో అభిమానులు ఊరట చెందారు. మెలోడి సాంగ్ రూపంలో రాబోయే ఈ ఫస్ట్ సింగిల్, ప్రభాస్ మ్యూజిక్ జర్నీకి కొత్త ఛాప్టర్‌గా నిలిచే అవకాశముంది.