హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది.
అల్పపీడనానికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. పశ్చిమ, వాయువ్య దిశగా అల్పపీడనం ప్రయాణించే అవకాశం ఉందని చెప్పింది. అలాగే ఈ నెల 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు పడుతాయని చెప్పింది.