రష్యా జరిపిన బాంబుదాడిలో ఈ పసిబాలికకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తంలో తడిసిన బిడ్డను తండ్రి దవాఖానకు మోసుకువచ్చారు. బాలిక వేధనను చూసి వైద్యులు చలించిపోయారు. కండ్లనీళ్లు పెట్టుకొన్నారు. ఏడ్చారు. ఏడుస్తూనే బతికించడానికి ప్రయత్నించారు. వాళ్ల ప్రయత్నం ఫలించలేదు. పుతిన్ యుద్ధ దాహానికి ముక్కుపచ్చలారని పసిబాలిక ప్రాణం కోల్పోయింది. యుద్ధానికి చెల్లించాల్సిన మూల్యం ఏంటో చెప్పి వెళ్లిపోయింది ఆ చిట్టితల్లి.
ఆటపాటలు తప్ప ఏమీ తెలియని ఈ ఆరేండ్ల బాలిక ఏం పాపం చేసింది. బాధతో, భయంతో ఈ బాలిక చేసే ఆర్తనాదాలు పుతిన్ నీకు వినిపించవా.. రక్తపు మడుగులో కొనప్రాణాలతో గిలగిలా కొట్టుకొంటున్న ఆమె శరీరం నీకు కనిపించదా.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈమె పేరు అనస్తాసియా లెన్నా. ఉక్రెయిన్ మాజీ సుందరి. తన దేశ పరిస్థితిని చూసి చలించిపోయింది. తన వంతు సాయం చేయాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా చేత ఆయుధం పట్టింది. యుద్ధ రంగంలోకి అడుగుపెట్టింది. శత్రు మూకల నుంచి మాతృ భూమిని కాపాడుకోవాలని పోరాడుతున్నది. ‘నా దేశం సరిహద్దును దాటేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే వారికి మరణం తప్పదు’అంటూ ట్విట్టర్లో గన్ పట్టుకున్న ఫొటోను పోస్టు చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్గా మారింది.