హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): వాహనాన్ని నడుపుతున్నప్పుడు కొన్నిసార్లు యాక్సిలరేటర్ వాడటం ఆపినా అది దానంతట అదే ముందుకు కదులుతుంది. అప్పటివరకు వాహనం తయారుచేసుకున్న గతిశక్తి ఆ సమయంలో వినియోగించుకోవడమే ఇందుకు కారణం. ఈ సూత్రం ఆధారంగానే హైదరాబాద్‌కు చెందిన చాగంటి శ్రీనివాస భాస్కర్ విద్యుత్తును ఉత్పత్తిచేసే ‘కమ్మ గేర్ ఫ్లై వీల్’ పరికరాన్ని ఆవిష్కరించారు. కొద్దిపాటి విద్యుత్తును ఉపయోగించి ఆ పరికరంతో ఎంతైనా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. సాంకేతిక భాషలో ‘హైబ్రిడ్ పర్పెచ్యువల్ మెకానికల్ బ్యాటరీ’ అంటారు. ఈ విధానాన్ని కమ్మ గేర్ ఫ్లై వీల్ పవర్ జనరేషన్, మల్టిప్లికేషన్, స్టోరేజీ టెక్నాలజీ అంటారు. దీనిని వాహనాలు, ఇండ్లు, పరిశ్రమల్లో ఎక్కడైనా వాడుకోవచ్చని, ఒక వాట్ నుంచి వెయ్యి మెగావాట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శ్రీనివాస్ భాస్కర్ చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పేటెంట్‌ను కూడా జారీచేసింది.
పనిచేసే విధానం..
ఈ యంత్రంలో బ్యాటరీ, వెరియేబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ ఫ్లైవీల్, హైస్పీడ్ గేర్‌బాక్స్, జనరేటర్, షాఫ్ట్ను ఉపయోగించారు. బ్యాటరీ నుంచి 415 వోల్టుల విద్యుత్తును వెరియేబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్‌లోకి పంపిస్తారు. ఇక్కడ విద్యుత్తును ప్రీక్వెన్సీ డ్రైవ్ ఏసీ నుంచి డీసీకి, డీసీ నుంచి ఏసీకి మార్చుకొంటుంది. మోటర్ షాఫ్ట్ను గేర్‌బాక్స్‌తో, గేర్‌బాక్స్‌ను ఫ్లైవీల్ షాఫ్ట్, ఫ్లైవీల్ షాఫ్ట్ను గేర్‌బాక్స్ జనరేటర్‌తో అనుసంధానించారు. ఈ విధానంలో బ్యాటరీ నుంచి విద్యుత్తును పంపినప్పుడు వెరియేబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ కరెంట్‌ను కావాల్సినట్టుగా మార్చుకొని యంత్రాలన్నింటినీ తిప్పుతుంది. ఈ యంత్రాల ఆధారంగా విద్యుత్తు జనరేటర్ తిరుగుతుంది. దీంతో విద్యుత్తు ఉత్పత్తవుతుంది. ఒకసారి తిరగడం మొదలైతే మళ్లీ బ్యాటరీలతో తిప్పాల్సిన అవసరముండదు. తనకు కావాల్సిన విద్యుత్తును వాడుకోవడంతోపాటు మనకు కావాల్సిన విద్యుత్తును అందిస్తుంది.
రెండు సూత్రాలు..
యాక్సిలరేషన్, డిసిలరేషన్ అనే రెండు సూత్రాలపై ఈ యంత్రం పనిచేస్తుంది. జనరేటర్ మోటర్‌కు కేవలం 0.5 సెకండ్ల నుంచి 60 సెకండ్ల వరకు ఇన్పుట్ పల్స్‌ను అందించడాన్ని యాక్సిలరేషన్ అంటారు. ఫ్లైవీల్ తిరిగి జనరేటర్‌లోని రోటర్ షాఫ్ట్ను కదిలించి విద్యుత్తును ఉత్పత్తిచేస్తుంది. దీనిని డిసిలరేషన్ అంటారు. డిసిలరేషన్ ప్రక్రియ ఒకసారి ప్రారంభమైతే నిరంతరాయంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.