(ఎంతటి దురదృష్టవతుండవయ్యా జఫర్-నీ మనసుకు నచ్చిన చోట ఖననం అయ్యేందుకు, నీకు రెండు గజాల నేల కూడా దక్కలేదే!) అని వాపోయాడట ఆఖరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్. బ్రిటిష్ వలసవాదులు జఫర్ను అంతిమదినాల్లో రంగూన్ లోని జైలులో నిర్బంధించారు. అక్కడే ఆయన కన్నుమూసిన సంగతి చరిత్ర చదువుకున్నవారికి తెలిసిందే! ఇంతకీ, జఫర్ విలపిస్తున్నది తన సమాధి కోసం భారతదేశంలో ఆరడుగుల నేలకు నోచుకోలేక పోయినందుకేనా? కాదు! కనీస మానవ గౌరవం ఇవ్వడం కూడా తెలియని ఆంగ్లేయుల అనాగరికతను చూసి జాలిపడుతూ ఆయన ఆ మాట అన్నాడు!! అలాంటి భావుకులకు ఈ గడ్డ మీద కరువులేదు. ఎటొచ్చీ, వారిలో చాలామంది గురించి మనకు తెలియకపోవచ్చు.
తెలంగాణ కథకుల్లోనూ అలాంటివారు ఉన్నారు. పొట్లపల్లి రామారావు వారిలో ప్రముఖుడు. కాళోజీ సోదరులు, వట్టికోట ఆళ్వారుస్వామి, పెండ్యాల రాఘవరావు తదితరులతో కలిసి పొట్లపల్లి సామాజిక-రాజకీయ-సాహిత్య కార్యకలాపాల్లో పాలుపంచుకొనేవారు. 1917లో జన్మించిన రామారావు, వరంగల్ నగరానికి సమీపంలోని తాటికాయల అనే గ్రామంలో సామాన్యమైన రైతుగా ఎనిమిదిన్నర దశాబ్దాల కాలం పాటు జీవించారు. తన పల్లే తన ప్రపంచమని ఆయన గర్వంగా చెప్పుకోవడం గమనార్హం. అయితే, ఆ ప్రపంచం ఆయన్ని పట్టించుకొని, రచయితగా ప్రాధాన్యాన్ని గుర్తించడంలో మాత్రం ఎంతో జాప్యం జరిగిపోయిన మాట ఓ చేదునిజం!
చదివింది ఏడోతరగతి వరకు మాత్రమే అయినా, అనేక కవితలు, కథానికలు, రూపకాలూ వెలువరించి ఆనాటి గ్రామీణ జీవితాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించారు పొట్లపల్లి. ‘చుక్కలు’, ‘మెరుపులు’, ‘నాలో నేను’, ‘అక్షర దీప్తి’, ‘ఆత్మవేదన’ ఆయన వెలువరించిన కవితా సంకలనాలు.
‘జైలు’ (ఇతర కథలు) అనేది ఆయన జైలు అనుభవాల ప్రాతిపదికగా రాసిన ఎనిమిది కథల సంకలనం. పొట్లపల్లి రామారావు జీవిత సాహిత్యాలపై పరిశోధన చేసిన మిత్రుడు భూపాల్ మరో 14 కథలను వెలికితీశారు. అన్నింటినీ కలిపి, ‘పొట్లపల్లి రామారావు లభ్య రచనల సంపుటం (వచన విభాగం)’లో చేర్చారు. పొట్లపల్లి తన మౌలికతను రుజువు చేసుకున్న మరో రంగం రూపకరచన. ఆయన మొత్తం 14 రూపకాలు రాశారని అంటారు. వాటిలో, పగ (నాటిక), పాదధూళి (నాటిక), న్యాయం (నాటిక), సర్బరాహి (నాటిక) సుప్రసిద్ధాలు. ఈ రూపకాల్లో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రాసినవి అని చెప్తారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గ్రామాలపై పోలీసుల దమనకాండ ఇతివృత్తంగా పొట్లపల్లి రాసిన ‘పగ’ నాటిక 1948 మే నెల ‘అభ్యుదయ’ సంచికలో అచ్చయింది.
సంవత్సరం తర్వాత, 1949 జూలై 14-16 తేదీల్లో నాటి కృష్ణా జిల్లాలోని యెలమర్రు-కాటూరు గ్రామాల్లో పోలీసులు సాగించిన దమనకాండ అచ్చం ఇదే మూసలో సాగింది. ‘కవులు క్రాంతదర్శులు’ అంటారు – పొట్లపల్లి రామారావు విషయంలో అది మరోసారి రుజువయింది. కాగా, సెట్టి ఈశ్వరరావు సంపాదకత్వంలో వెలువడిన ‘విశాలాంధ్ర’ వారపత్రిక 1949 ఆగస్టు సంచికలో పొట్లపల్లి ప్రచురించిన నాటిక ‘పాదధూళి’ కూడా ఓ వాస్తవ ఘటనకు నాటకీయ రూపమే.
పొట్లపల్లిని కొందరు రష్యన్ మహారచయిత లియో టాల్స్టాయ్తో పోల్చా రు. మరికొందరు మలయాళ మహారచయిత తగళి శివశంకర పిళ్ళైతో పోల్చారు. రామారావు కథానికలు, కవితలు, నాటకాలు-నాటికలు రాసేనాటికి తెలంగాణ గడ్డపై అప్పట్లో నెలకొని ఉన్న పరిస్థితులు మరెక్కడా లేవు. ఆ పరిస్థితుల్లోంచే పుట్టిన మౌలిక సాహిత్య మూర్తిమత్వం రామారావుది.
అనగనగా ఓ పేదరాలు; పాలుతాగే పసిబిడ్డకు తల్లి ఆమె. దొరల ఇంటి బిడ్డకు పాలు ఇవ్వాలన్నది ఆమె నెత్తిన రుద్దిన ‘విధి’. దాంతో, తల్లిపాలకు నోచుకోక శైశవంలోనే ఆమె బిడ్డ కన్నుమూశాడు. ఆ ఊరి శ్మశానంలో, బిడ్డ మృతదేహాన్ని ఖననం చేసేందుకు నాలుగడుగుల నేల కూడా దొరకలేదు. అలాంటి ఊరికి, వల్లకాటికీ తేడా ఏముందనుకుని, ఆ తల్లి తన బిడ్డను ఊర్లోనే ఖననం చేసింది.
హృదయవిదారకమైన ఈ కథనాన్ని ఏడు దశాబ్దాల కిందట పొట్లపల్లి రామారావు ఓ కథానికగా రాశారని మనలో ఎంతమందికి తెలుసు? కులవివక్ష రోగం సోకిన మన ఊళ్లు, అడవుల కన్నా అన్యాయంగా మారిపోయాయని అదే కథకుడు రాసిన సంగతి మనలో ఎంతమందికి తెలుసు? ముత్యాల వేటగాళ్లు వర్తకులకు ముత్యాలనిచ్చి, కుటుంబాలకు కన్నీరు మిగులుస్తారని ఏడు దశాబ్దాల కిందట అదే కథకుడు నమోదు చేశారని మనలో ఎంతమందికి తెలుసు? ఈ రచనలన్నీ 70 ఏండ్ల కిందటే వెలువడ్డాయని మనసులో పెట్టుకోవాల్సి ఉన్నది. అప్పుడే పొట్లపల్లి రామారావు రచనల చారిత్రక ప్రాముఖ్యం పూర్తిగా బోధపడుతుంది.
-మందలపర్తి కిశోర్