న్యూఢిల్లీ : శక్తి స్కీమ్, జీఓ 97 ను రద్దు చేసి పాత పద్ధతిన పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) డిమాండ్ చేశారు. న్యూ ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది విద్యార్థులు, 10 వేల మంది ఉపాధ్యాయులు దాదాపు లక్ష కుటుంబాలు శక్తి స్కీమ్, జీవో 97 ని రద్దు చేయాలని రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు.
విద్యార్థులు పాలిటెక్నిక్ చేసి ఇంజినీర్లుగా ఉన్నత విద్య వైపు చూస్తారని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం శక్తి స్కీమ్, డిప్లమా అని విద్యార్థులను కూలీలుగా తీర్చిదిద్దాలని చూస్తుందని విమర్శించారు. ఐటీఐ లకు ఇండస్ట్రీస్ ను అనుసంధానం చేసి విద్యార్థులకు స్కిల్ డెవెలప్మెంట్ లో నైపుణ్యం కల్పించి, అప్రెంటిస్ తర్వాత వందశాతం జాబ్ కల్పించే దిశగా ఐటీఐ లను బలోపేతం చేయాలన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఐటీఐ తర్వాత ఈ సెట్ రాసి బీటెక్ 2వ సంవత్సరం లో చేసి బిటెక్, ఎంటెక్ లాంటి ఉన్నత విద్యను అభ్యసించి, ఇంజనీర్లుగా ఎదగడానికి అవకాశాలు ఇవ్వాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు సుమారు 14 వేల కోట్ల ను చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు రాకేష్ దత్త, జయంత్ యాదవ్, రజినీకాంత్ పాల్గొన్నారు.