హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి పోలీసు స్టేషన్లో నమోదైన కేసు విషయంలో ఆయనను అరెస్ట్ చేయడంపై రాజకీయ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను ఫ్యాబ్రికేట్ చేశారని, వాటిని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు డీజీపీకి ఫిర్యాదు చేశారని మరునాడే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే, బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి శనివారం తెలంగాణ భవన్లో నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్టు చేయడంపై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.
‘సమాజంలో అలజడి సృష్టించే వ్యాఖ్యలు ఎవరు చేసినా, ఏ హోదాలో చేసినా చర్యలు తీసుకోవాల్సిందే.. చట్టం ముందు అందరూ సమానులే. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో చట్టం కొందరికే చుట్టంలా మారింది’ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నవారు, ప్రశ్నించేవారిపై చట్టం దూకుడుగా వ్యవహరించినట్టు అధికారపక్షంలో ఉన్నవారిపై ఎందుకు వ్యవహరించదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
‘చట్టం అందరికీ సమానమైతే, సమాజంలో అల్లకల్లోలం , అలజడి సృష్టించే రీతిలో వ్యాఖ్యలు చేసినవారు అధికారం పక్షంలో ఉంటే వారికి చట్టం వర్తించదా? ఆయా సందర్భాల్లో వివాదాస్పద, ప్రజలను ప్రత్యేకించి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరు?’ అనే వాదన వినిపిస్తున్నది. పీసీసీ హోదాలోనే కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన, చేస్తున్న వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని, మరి వారిపై ఎన్ని కేసులు నమోదు చేశారని, పోలీసులకు బాల్క సుమన్‌పై ఉన్న శ్రద్ధ, అధికారంలో ఉన్నవారిపై ఎందుకు లేదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది.
బహిరంగసభలు, శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై నిత్యం చేస్తున్న వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకుంటున్న మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టారీతిగా నోరుపారేసుకుంటున్నారు. నోటికి ఎంతొస్తే అంత అన్నట్టుగా మాట్లాడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా మాట్లాడుతున్న వారిపై పోలీసులు ఎన్ని కేసులు పెట్టారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది. తమపై ఫిర్యాదు వచ్చినా రాకపోయినా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని, అదే తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయటం లేదని ఉదహరిస్తున్నది. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ లాంటివాళ్లు బహిరంగ సభవేదికల మీదే ‘అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా’ అని మాట్లాడినా కేసులు మోపరేందుకు అని నిలదీస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అండ చూసుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇష్టారీతిగా నోరుపారేసుకుంటున్నారని, అందుకు జడ్చర్ల, రామగుండం ఎమ్మెల్యేల వ్యాఖ్యలే నిదర్శమని ఉదహరిస్తున్నది.
పీసీసీ అధ్యక్షుడిగా, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్‌రెడ్డి రాజకీయ వేదికల మీదే కాకుండా చట్టసభ అయిన శాసనసభలోనూ తన హోదాను మరిచిపోయి వ్యాఖ్యలు చేసిన ఉదంతాలున్నాయని, మరి వాటిపై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయలేదని బీఆర్ఎస్ నిలదీస్తున్నది. తాను చేసిన వ్యాఖ్యలను గ్లోరిఫై చేస్తూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తనపై కేసులు పెట్టి అరెస్టు చేశారని, అదే చట్టం సీఎం, ఇతర కాంగ్రెస్ నేతలకు ఎందుకు వర్తించదని బాల్క సుమన్ ప్రశ్నించారు.