బంజారాహిల్స్,జూలై 14 : ‘బీఆర్ఎస్ నేతలను కోసి రక్తాన్ని చల్లితే పంటలు పండుతాయంటూ..’ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో చేపట్టిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం బాటిళ్లతో సీఎం నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన 28 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పిలుపుతో సోమవారం తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని సీఎం రేవంత్‌రెడ్డికి ఇస్తామని పెద్దసంఖ్యలో కార్యకర్తలు రక్తం బాటిళ్లతో తెలంగాణ భవన్ నుంచి బయటకు వచ్చి ర్యాలీగా వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని, అరెస్టు చేశారు.