Bandi Sai Bhageerath | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన మైనర్ బాలిక తల్లి కీలక ప్రకటన చేశారు. తన కూతురుపై భగీరథ్ చేసిన అఘాయిత్యం, ఆ సమయంలో తన కూతురు పడిన ఆవేదన, తమకు పోలీస్ స్టేషన్లో ఎదురైన ఇబ్బందులు, బండి సంజయ్ బెదిరింపులు, కావాలనే తన బిడ్డపై చేస్తున్న దుష్ప్రచారం, తమ కుటుంబానికి పొంచి ఉన్న ముప్పు వంటి పలు అంశాలపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
భరించలేని తీవ్ర వేదన అనుభవిస్తున్నప్పటికీ.. బాధితురాలైన మైనర్ కుమార్తె నిస్సహాయ తల్లిగా ఈ ప్రకటన జారీ చేయాల్సి వస్తుందని ఆమె తెలిపారు. నా కుమార్తెకు రక్షణ, గౌరవం, భవిష్యత్తును పొందే అర్హత అందరి లాగే ఉన్నదని పేర్కొన్నారు. మేం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్లం.. మాకు ఎలాంటి రాజకీయ అండదండలు లేవని స్పష్టం చేశారు. ఈ రోజు మా బిడ్డను కాపాడుకోమని, మా న్యాయ పోరాటాన్ని వినమని సమాజంలోని వ్యవస్థలను వేడుకోవాల్సిన దారుణమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ఈ ప్రకటన పగతోనో, ప్రచారం కోసమో చేయడం లేదని.. నిజాలతో మా బాధను అందరికీ తెలియపరచాలని ఈ ప్రకటన చేస్తున్నామని తెలిపారు.
నిందితుడు బండి భగీరథ్ బయట ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడని బాధితురాలి తల్లి తెలిపారు. మా కుటుంబానికి తీవ్రమైన ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో న్యాయం కోసం సంగప్పతో కలిసి బండి సంజయ్ ఇంటికి వెళ్తే బెదిరింపులకు దిగారని పేర్కొన్నారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా, వ్యక్తు లద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈ బెదిరింపులు తమను తీవ్ర భయాన్ని కలగిస్తున్నాయని చెప్పారు.
మా బిడ్డ పుట్టిన తేదీకి సంబంధించి కావాలనే వివాదం రేపి, న్యాయపరమైన విచారణ ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. 2025లో బండి సంజయ్ కుమారుడితో తనకు పరిచయం ఏర్పడిందని తన కూతురు చెప్పిందని ఆమె తెలిపారు. మొదట సాధారణ పరిచయంగా ప్రారంభమై.. తర్వాత భగీరథ్ తనతో పదే పదే మాట్లాడేవాడని, బలవంతంగా ఒప్పించడం, అనేక రకాల ప్రలోభాలకు గురిచేశాడని పేర్కొన్నారు. తర్వాత నా కుమార్తెకు మాయమాటలు చెప్పి మానసికంగా లొంగదీసుకున్నాడని చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా.. అనేకసార్లు తీవ్రంగా ప్రతిఘటించిన సందర్భాల్లోనూ శారీరక సంబంధం కోసం బండి భగీరథ్ పదే పదే ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపారు.
ముఖ్యంగా 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి, 2026 జనవరి 1వ తేదీ తెల్లవారుజామున మొయినాబాద్‌లో తన కుమార్తెపై దాడి జరిగిందని తెలిపారు. ఆ రోజు తనకు ఇష్టం లేకపోయినా మద్యం సేవించాలని ఒత్తిడి తీసుకొచ్చాడని పేర్కొన్నారు. అచేతన స్థితిలో ఉన్నప్పుడు అనుచితమైన ప్రవర్తనకు దిగాడని, బలవంతంగా, శారీరకంగా దాడి చేశాడని వెల్లడించారు. ఆ తర్వాత కూడా అనేక సార్లు శారీరక సంబంధం కోసం ఒత్తిడి తీసుకొచ్చాడని తెలిపారు. చివరకు ధైర్యం చేసి 2026 మార్చి, ఏప్రిల్ నెలలో చట్టపరంగా ముందుకు పోదామని ప్రయత్నించామని పేర్కొన్నారు.
బండి భగీరథ్ ప్రతినిధి అని చెప్పుకుంటూ ఏప్రిల్ 22వ తేదీన సంగప్ప తమ నివాసానికి వచ్చి మాట్లాడాడని తెలిపారు. సంగప్ప చెప్పినట్లుగా ఆ తర్వాత రోజు బండి సంజయ్ ఇంటికి వెళ్లి కలిశామని పేర్కొన్నారు. ఆ భేటీలో తమకు భరోసా, రక్షణ కలుగుతుందని ఆశించాం కానీ.. బండి సంజయ్ ఇంటి నుంచి తీవ్రమైన భయంతో బయటకు వచ్చామని తెలిపారు. తన రాజకీయ ప్రాబల్యం, అనుచరుల ద్వారా మా కుటుంబానికి కష్టాలు తప్పవని, జరగబోయే పరిణామాల గురించి బండి సంజయ్ చేసిన హెచ్చరికలు తీవ్రంగా భయపెట్టాయని చెప్పారు. ఆ రోజు నుంచి భయంభయంగానే బతుకుతున్నామని తెలిపారు.
చివరకు ఈ నెల 8వ తేదీన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి పోక్సో చట్టం కింద మా ఫిర్యాదును నమోదు చేయాలని కోరామని తెలిపారు. మైనర్ బాలిక అయిన మా కూతురు తనకు కలిగిన కష్టనష్టాలను వెల్లడించినప్పటికీ ఐదు గంటలకు పైగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పోలీసులు వేచి ఉండేలా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మాకు జూరిస్డిక్షన్ సమస్యలు ఉన్నాయి, ఫిర్యాదును బదిలీ చేస్తామంటూ రకరకాల కారణాలు చెప్పారని.. జీరో ఎఫ్ఐఆర్ గురించి పదే పదే పట్టుబట్టిన తర్వాతే రశీదు జారీ చేశారని తెలిపారు.
మా మైనర్ కుమార్తెకు జరిగిన ఇంతటి ఆవేదన ఇంకొక ఏ బిడ్డకు కలగకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే కొందరు దీనిని వ్యక్తిగత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మొదట పోలీసులకు బాధితురాలి ఆరోపణలు స్పష్టంగా చెప్పినప్పటికీ, బెయిల్ పొందదగిన నిబంధనలను మాత్రమే చేర్చారని పేర్కొన్నారు. ప్రజల ఆందోళన, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి మా కూతురు నుంచి మరోసారి వివరమైన వాంగ్మూలం నమోదు చేసి తీవ్రమైన సెక్షన్లను నమోదు చేశారని చెప్పారు. మా బిడ్డపై జరిగిన దాడిని నిష్పాక్షికంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా విచారణ జరగాలని కోరారు. మా మైనర్ బిడ్డ ఫోటోలను, ఆమె గుర్తింపును బయటకు వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. మైనర్ల గుర్తింపును, గౌరవాన్ని కాపాడటం పోక్సో చట్టం బాధ్యత మాత్రమే కాదు, సమాజం యొక్క నైతిక బాధ్యత అని వేడుకున్నారు.