ప్రభుత్వం ఓవైపు ఫార్మాసిటీ, మరోవైపు బుల్లెట్ ట్రైన్ పేరుతో మా భూములను బలవంతంగా లాక్కుంటున్నది. కోర్టులు కూడా రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేయవద్దని ఆదేశించినా పట్టించుకోవడం లేదు. ఫార్మాసిటీ, బుల్లెట్‌ట్రైన్ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలి.

– హంసమ్మ, నానక్‌నగర్
రంగారెడ్డి, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : కేసీఆర్ తలపెట్టిన గ్రీన్ ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులు కాంగ్రెస్ సర్కార్‌పై కన్నెర్రజేశారు. భూములను తిరిగి ఇస్తామంటూ ఎన్నికల ముందు నమ్మించి ఓట్లేయించుకొని, అధికారంలోకి రాగానే ముఖం చాటేయడమే గాక ఫ్యూచర్‌సిటీ పేరిట కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మంత్రులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ ఫార్మా బాధిత రైతులు సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. యాచారం మండల పరిధిలోని మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాల నుంచి వందలాదిగా చేరుకున్న రైతులు.. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవటంతో అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు.
ఎమ్మెల్యే వచ్చేదాకా తాము ఇక్కడినుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. వంటావార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే తీరుకు నిరసనగా బతుకమ్మ ఆడారు. అక్కడినుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఓవైపు ముఖ్యమంత్రి ఫార్మాసిటిని రద్దుచేశామని చెప్తూనే మరోవైపు ఫ్యూచర్‌సిటీకి భూములను ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అదేవిధంగా తమ భూములను లాక్కోవడానికి బుల్లెట్‌ట్రైన్ కోసం మరోమారు భూసేకరణ చేస్తున్నారని, తమకు ఎలాంటి ఉపయోగం లేని బుల్లెట్ రైళ్లు వద్దని, తమ భూములు తమకే కావాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఉద్యమం ఆగదని తేల్చిచెప్పారు.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతి పెద్ద గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటును చేపట్టింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 19,333.20 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించి, 14వేల ఎకరాలను భూసేకరణ ద్వారా తీసుకున్నది. రైతుల నుంచి తీసుకున్న భూముల్లో భూసేకరణ నోటిఫికేషన్లో పొందుపరిచిన ప్రకారం ఫార్మాసిటీ ఏర్పాటుచేస్తామని, ఒకవేళ చెప్పిన విధంగా ఇతర అవసరాలకు వినియోగిస్తే రైతుల భూమి తిరిగి పొందవచ్చని షరతు విధించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫార్మాసిటీ రైతులను రోడ్డున పడేసింది. మూడేండ్ల నుంచి వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వం మొండివైఖరి వీడటం లేదు. ఫార్మా రైతులను అరిగోస పెడుతున్నది.

రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్‌సిటీ, ఫార్మాసిటీలు మాకొద్దు. మా ఊర్లు, మా భూములే మాకు కావాలి. కాంగ్రెస్ వాళ్లు ఎన్నికల ముందు ఫార్మాసిటీని రద్దుచేస్తామని ఆ భూములు రైతులకే ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, నిషేధిత జాబితాలో ఉన్న రైతుల పట్టా భూములను కూడా విముక్తి చేసి రైతుల పేర్లపై ఆన్లైన్లో చేస్తామని నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటతప్పి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఫార్మాసిటీని రద్దు చేసి ఆ భూములను రైతులకు ఇవ్వాలి. పట్టా భూములను టీజీఐఐసీ పేరుమీద నుంచి తొలగించి రైతులను ఆన్లైన్లో చేర్పించాలి. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రైతు కూలీలకు కూడా న్యాయం జరిపే వరకు తాము పోరాటం కొనసాగిస్తాం.
ఫార్మాసిటీని రద్దు చేసి భూములను తిరిగి రైతులకే ఇస్తామని ఎన్నికల ముందు ఎమ్మెల్యే రంగారెడ్డి, మంత్రులు మా ప్రాంతానికి వచ్చి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. అలాగే, పట్టా భూములను ఇవ్వాలని రైతులు కోర్టుకు వెళ్లినా బలవంతంగా ఆ భూముల పరిహారాన్ని అథారిటీలో జమచేశారు. రైతుల భూములను ఆన్లైన్లో నుంచి తొలగించి టీజీఐఐసీ పేరుమీద ఎక్కించారు. ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలి. అలాగే, సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు ఇస్తామన్న రూ.2,500 కూడా వెంటనే ఇవ్వాలి.
సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీని వెంటనే రద్దు చేసి భూసేకరణ నిలిపివేయాలి. ఫార్మాసిటీని రద్దు చేయాలని తాము ఎప్పటినుంచో ఆందోళన చేస్తున్నాం. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే మార్చుకోవాలి. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లేకపోతే ఆందోళనలు కొనసాగిస్తాం.