కరీమాబాద్, జనవరి 18: దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు దేశ ప్రజలు చూస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఖమ్మంలో బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లగా, ఎమ్మెల్యే పెరుకవాడలోని క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ ఖమ్మం బహిరంగ సభ విజయవంతానికి దేశ ప్రజలు కదిలి వచ్చారన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు వందలాది వాహనాల్లో తరలివెళ్లినట్లు తెలిపారు. దేశంలో పెద్ద పార్టీగా బీఆర్ఎస్ అవతరించబోతున్నదని వెల్లడించారు. అన్ని రాష్ర్టాల ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని చెప్పారు. దేశ ప్రజలు కేసీఆర్ను ప్రధానిగా చూడాలనుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ అరాచక పాలనలో విసిగిన ప్రజలకు బీఆర్ఎస్ ఆశాదీపంగా మారిందన్నారు. దేశంలో మార్పు జరుగాలంటే కేసీఆర్ ప్రధాని కావాలన్నారు. ముందుగా ఖమ్మం సభకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు ప్రజలు దారిపొడవునా అభివాదాలు చేశారు. సమీపంలోని ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం క్యాంపు కార్యాల యానికి చేరుకున్నారు.
నగరం నుంచి ఖమ్మం వైపు..
వరంగల్చౌరస్తా/కరీమాబాద్/కాశీబుగ్గ: ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభకు నగరంలోని 27, 36వ డివిజన్ల నుంచి నాయకులు బయల్దేరి వెళ్లారు. ఎమ్మెల్యే నరేందర్ పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లినట్లు డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాకయ్య తెలిపారు. సీఎం కేసీఆర్ ఉత్తర, దక్షిణ భారత దేశాల ప్రాంతీయ, జాతీయ పార్టీలను ఏకం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఖమ్మం సభకు అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని పలు డివిజన్లకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. వారికి ఇబ్బందులు కలుగకుండా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించారు. వరంగల్ తూర్పులోని పలు డివిజన్ల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఖమ్మం తరలివెళ్లారు. 3వ డివిజన్ నుంచి కార్పొరేటర్ జన్ను షీభారాణి-అనిల్, 20వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్, 19వ డివిజన్ నుంచి మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, 18వ డివిజన్ నుంచి వస్కుల బాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.