చిక్కడపల్లి, జూన్ 25 : కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల అమలు కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణ కార్మిక సమాఖ్య (టీకేఎస్) 6వ మహాసభను గురువారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోట రామన్న, అధ్యక్షుడు వసపాక నర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా మధుసూదనాచారి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ అసంఘటిత కార్మికులందరికీ ప్రభుత్వం భూమి కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులు, పేదలకు ఇచ్చిన హామీలు చేయకపోతే పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక నాయకుడు భిక్షమయ్య, టీపీసీసీ అధికారి ప్రతినిధి రాజేందర్, ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్రావు, జనార్దన్‌గౌడ్, పల్లెల వీరస్వామి, శంకర్, యాదగిరి పాల్గొన్నారు.