ఎక్కడో ఉన్న వస్తువుని ఇంటర్నెట్లో చూసి కొనడమే ఆన్లైన్ ఆర్డర్. అసలు వస్తువు డెలివరీ అయ్యాక అది స్క్రీన్ మీద కనిపించినంత కలర్ఫుల్గా ఉండక పోవచ్చు. ‘ఆన్లైన్లో ఒక దానిని ఆర్డర్ చేయడం దేనికి, షాప్‌నే ఆర్డర్ చేసుకుంటే నచ్చింది కొనుక్కోవచ్చు కదా’ అనుకుంది శేరి సంజన. అనుకున్నంత పనీ చేసింది. మొబైల్ క్లాత్ స్టోర్‌ను మొదలుపెట్టింది. పార్టీకి, ఫంక్షన్‌కి కావాల్సిన డ్రెస్‌లు కావాలని ఆమెకు కాల్ చేస్తే చాలు ‘ద ఫ్యాషన్ ట్రక్’ని మీ ఇంటికే తోలుకొచ్చేస్తుంది. కాలేజ్ ఈవెంట్ కోసం అయితే క్యాంపస్‌కే వచ్చేస్తుంది. అందరికీ సరిపోయేలా అన్ని సైజులతో బండెడు దుస్తులను ఫ్యాషన్ ట్రక్ మోసుకొస్తుంది. సరిపోయే సైజ్ కోసం ఈ ట్రక్‌లోనే ఓ ట్రయల్ వేయొచ్చు. నచ్చిన రంగు ఎంచుకోవచ్చు. ఐడియా భలేగుంది కదా! మొబైల్క్లాత్ స్టోర్ నడపాలని ఎందుకనిపించిందో… అందుకు ఏం చేసిందో.. సంజన మాటల్లోనే..
కాలేజ్ డేస్ నుంచే ఆంత్రప్రెన్యూర్ కావాలని ఉండేది. సొంత వ్యాపారంలో సంతృప్తి మాత్రమే కాదు ఇంకో నలుగురికి ఉపాధి కల్పించినవాళ్లం అవుతాం. కానీ, పరిస్థితులు ఆలోచనకు అనుకూలంగా ఉండవు. కాబట్టి మొదట ఉద్యోగంలో చేరాను. హైదరాబాదాలోని బోజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్‌లో బీటెక్ చదివాను. క్యాంపస్ ప్లేస్మెంట్లో అమెజాన్‌లో జాబ్ ఆఫర్ వచ్చింది. అందులో రిస్క్ అనలిస్ట్‌గా చేరాను. కొంతకాలం తర్వాత గూగుల్‌లో చేరాను. అందులో ఫ్రాడ్ అండ్ రిస్క్ స్పెషలిస్ట్‌గా పని చేశాను. కరోనా కాలంలో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. మా ఇంట్లో అందరికీ కొవిడ్ సోకింది. అప్పుడు మా పాపకు ఆరు నెలల వయసు. పాప ఆరోగ్యం చాలా క్రిటికల్‌గా మారింది. నాన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం మానేయక తప్పలేదు.
ఏడాది గడిచింది. మళ్లీ ఉద్యోగంలోకి వెళ్లాలనిపించలేదు. సొంత బిజినెస్ చేయాలనుకున్నాను. ఉద్యోగంలో సంపాదించి దాచుకున్న డబ్బులతో ఆన్లైన్ బిజినెస్ మొదలుపెట్టాను. లేడీస్ కోసం రెడీమేడ్ దుస్తులు, డ్రెస్ మెటీరియల్స్ అమ్మాను. ఆ వ్యాపారం లాభదాయకంగానే సాగింది. ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నప్పుడు మొబైల్ స్టోర్ నడపాలనే ఐడియా తట్టింది. మన దగ్గర రోడ్ల పక్కన టిఫిన్స్, నూడుల్స్, బిర్యానీ అమ్మే ఫుడ్ ట్రక్లు ఉన్నట్టే విదేశాల్లో ఫ్యాషన్ ట్రక్లు ఉంటాయి. రకరకాల దుస్తులు అమ్ముతారు. ఇక్కడ అలాంటి వాటిని నడిపితే బాగుంటుందనిపించింది. కొనేవాళ్లు దుస్తుల దుకాణానికి వెళ్లడం కంటే దుస్తుల షాపే వారి దగ్గరికి వస్తే బాగుంటుంది కదా! ఈ ఆలోచనతో ఒక ఫ్యాషన్ ట్రక్ నడపాలనుకున్నాను. కానీ, అప్పుడే వద్దనుకుని వాయిదా వేసుకున్నాను. గ్రౌండ్ వర్క్ చేయాలనుకున్నాను. మార్కెట్‌ను అర్థం చేసుకోవడానికి మూడేళ్లు పట్టింది. మార్కెట్లో ఎవరికి ఏది నచ్చుతుందో, ఏ సెక్షన్ వాళ్లకు ఏది కావాలో నాకు అర్థమైంది. యోనిక్స్ పేరుతో కంపెనీ పెట్టి, మొబైల్ ఫ్యాషన్ స్టోర్ కోసం సిద్ధమయ్యాను.

ఒక వెహికిల్ కొని, ఇంటీరియర్ మార్చితే ఫ్యాషన్ ట్రక్ అయిపోదు. ప్రతి వాహనానికీ నిబంధనలు ఉంటాయి. దాన్ని అతిక్రమిస్తే రోడ్డు మీదకు అనుమతించారు. సేఫ్టీ కూడా ఉండదు. కాబట్టి ఎలాంటి వాహనం కొనుక్కోవాలో తెలుసుకునేందుకు పోలీస్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులను కలిశాను. చట్టాల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, వాటి పరిధిలో ఫ్యాషన్ ట్రక్ రూపొందించాలంటే ఏం చేయాలో అడిగాను. వాళ్లు ఫోర్ వీలర్, లైట్ వెహికిల్ తీసుకోమన్నారు. అధికారులు చెప్పినట్టుగా ఓ పాత ఫోర్ వీలర్ ట్రక్ కొన్నాను. ఇది సిటీలో ఏ రోడ్డు మీదైనా తిరగొచ్చు. ఎప్పుడైనా తిరగొచ్చు. ఆంక్షలు లేవు. కాబట్టి బస్తీలకు పోవడానికి, రోడ్డు పక్కన ఆఫీసుల ముందు, కాలేజీల ముందు నిలపడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొన్న వాహనానికి ఎలక్ట్రిఫికేషన్, ఇంటీరియర్ చేయించాను. ఒక దుస్తుల షాపులో అరలు, హ్యాంగర్స్తోపాటు డిస్ప్లేకి అనుకూలమైన వసతులు ఎలా ఉండాలో ఆ వాహనంలో అన్నీ అలా అమర్చాను. కొనుగోలుదారుల కోసం ట్రయల్ రూమ్ కూడా ఏర్పాటుచేశాను. ఒక డ్రైవర్, ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్‌తో మా ఫ్యాషన్ ట్రక్ రయ్.. రయ్‌మంటూ రోడ్డెక్కింది.
దుస్తులు అమ్మేవాళ్లను సమాజంలో చిన్న చూపు చూస్తారు. మా ఇంట్లో కూడా నాకు అదే ఎదురైంది. నేను ఇలా పెద్ద కంపెనీల్లో మంచి ఉద్యోగం వదిలిపెట్టి వ్యాన్‌లో డ్రెస్సులు అమ్మడం చాలామందికి నచ్చలేదు. కానీ, దారినపోయే వాళ్లు చూసి మెచ్చుకునేవారు. చాలా కంపెనీల సీఈఓలు మా వ్యాన్ చూసి ఆగేవారు. చూసిన తర్వాత శభాష్ అనేవారు. వీధుల్లో అమ్ముతున్నామని దీనిపట్ల ఎవరికీ చిన్న చూపు లేదు. కార్పొరేట్ ఎంప్లాయీస్ వస్తున్నారు, కొంటున్నారు. వచ్చినవాళ్లు మళ్లీ వస్తున్నారు. ప్రస్తుతానికి మెన్స్ వేర్ మాత్రమే అమ్ముతున్నాం. టీ షర్ట్స్, షర్ట్స్, జీన్స్ ఉన్నాయి. వీటిల్లో అందరికీ నచ్చేవి ఉండాలని రౌండ్‌నెక్, కాలర్, బ్యాక్ ప్రింట్, ట్రౌజర్స్, ఫార్మల్ షర్ట్స్ అందుబాటులో ఉంచాం. భవిష్యత్‌లో లేడీస్ వేర్ కూడా అమ్ముతాం.

హైదరాబాద్‌లో కూరగాయల వ్యాపారులు రోజుకు ఒక చోట కూరగాయలు అమ్మినట్టే.. మేం కూడా రోజుకోచోటికి మా మొబైల్ ఫ్యాషన్ స్టోర్‌ను తీసుకెళ్తాం. ఇంజినీరింగ్ కాలేజీల ముందు, కార్పొరేట్ ఆఫీస్‌ల ముందు ఉంచితే, వాళ్లు బయటికి వచ్చినప్పుడు షాపింగ్ చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. సమయం కలిసొస్తుందని వాళ్లు కూడా చెబుతున్నారు. జనాలు ఎక్కువగా ఉండే ఏరియాకి మా స్టోర్‌ని తీసుకెళ్తున్నాం. అలకాపురి, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, శివం రోడ్, చంపాపేట, సైదాబాద్, నాగోలు, హబ్సిగూడ ఇలా తిప్పుతూ ఉన్నాం. ప్రతి ఆదివారం రాత్రి జెన్ ప్యాక్ట్ (హబ్సిగూడ) ముందు పెడుతున్నాం. ఇక్కడ ఉండే ఫుడ్ కోర్టులకు వచ్చినవాళ్లు మా స్టోర్‌కి వస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలకూ వెళ్తున్నాం. ఫంక్షన్ కోసం ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేయాలనుకుంటే.. మాకు కాల్ చేస్తే చాలు షాప్‌నే వాళ్లింటికి తీసుకువెళ్తున్నాం. భవిష్యత్‌లో ఫ్రాంచైజీలు ఇవ్వడం ద్వారా టూ టైర్, త్రీ టైర్ సిటీలకు ఈ బిజినెస్‌ని విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నాను. ఎన్నో సవాళ్లు అధిగమించి సాఫీగా సాగుతున్న మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను.