చదువుకున్నవారే అన్నిరంగాల్లో రాణిస్తారనేది ఒకప్పటి మాట. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదనేది ఈ మహిళ మాట. భర్త కోసం కష్టమైనా ఇష్టంతో నకాశీ కళను నేర్చుకున్నది. దమ్మిడి ఆదాయం లేకపోయినా ఆ కళను మాత్రం విడిచిపెట్టకుండా ముందుకే సాగింది ఆ ఇల్లాలు. అవకాశాలను అందిపుచ్చుకొని ఆదరణలేని కళకు జీవం పోసి చేర్యాల పెయింటింగ్స్‌ను ప్రపంచానికి చాటింది పసుల మంగ. వీహబ్ సహకారంతో నకాశీ కళకు కొత్తరూపు తీసుకొచ్చిన మంగ గెలుపు ప్రస్థానం ఆమె మాటల్లోనే..
మాది కొలనుపాక. అక్కడ పనులేమీ లేకపోవడంతో రంగారెడ్డి జిల్లాలోని ప్రతాప్ సింగారానికి వలసొచ్చాం. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న సమయంలోనే నాన్న పక్షవాతం బారినపడ్డాడు. ఎన్ని దవాఖానాలు తిప్పినా ఫలితం లేకుండా పోయింది. నాన్న అనారోగ్యం కారణంగా ఒకటో తరగతిలోనే చదువుకు స్వస్తి పలికాను. నాకు తొమ్మిదేండ్లు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. అప్పులు తీర్చడం కోసం అమ్మకు తోడుగా నిలబడ్డాను. అమ్మతో నేనూ కూలీకి వెళ్లేదాన్ని. కొన్నాళ్ల తర్వాత నేను ఇంట్లో స్నాక్స్ తయారు చేస్తే, అమ్మ వాటిని బుట్టలో పెట్టుకొని బడి దగ్గర అమ్ముకొచ్చేది. అలా నాన్న చేసిన అప్పులన్నీ తీర్చేశాం. తెలిసిన సంబంధం రావడంతో 17 ఏండ్లకే నాకు పెండ్లి చేశారు. మా ఆయన మల్లేశం వాళ్లది చేర్యాల. ఐదో తరగతి వరకు చదువుకొని నకాశీ పెయింటింగ్స్ మీద ఇష్టంతో కళాకారుడిగా మారారు. అప్పట్లో పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. అయితే కళ మీద ఇష్టంతో నన్ను కూడా అందులోకి రమ్మని ప్రోత్సహించారు.

ఇద్దరూ ఇదే పనిలో ఉంటే సంసారం సాగదని చాలామంది ఎగతాళిగా మాట్లాడారు. అయినా నేను పట్టు విడవకుండా నేర్చుకోవడం ప్రారంభించాను. అది నాకు పరిచయం లేని కళ. అయినా ఇష్టంతో నేర్చుకున్నాను. మొదట్లో నేను ఒక్క బొమ్మ తయారు చేసేసరికి మా ఆయన పది బొమ్మలను తయారు చేసేవారు. ఇది చూసి చాలామంది నన్ను హేళన చేసేవారు. మా ఆయన కూడా ఒకటి రెండుసార్లు గట్టిగా మందలించారు. ఇక అప్పటినుంచి నేనేంటో నిరూపించుకోవాలని వేగంగా నేర్చుకున్నాను. అలా రాముడు, సీత మాస్కులతో పాటు పల్లెటూరి మహిళల బొమ్మలను తొలిసారి పూర్తిస్థాయిలో తయారుచేశాను. ఇద్దరం కలిసి చేసినా ఇల్లు గడవని పరిస్థితి.
ఇంటి అద్దె, నిత్యావసరాలకూ ఇబ్బంది పడ్డాం. మేము తయారు చేసిన బొమ్మలను కస్టమర్లకు కాకుండా నకాశీ కళాకారులకు ఇస్తే వాళ్లు ఎంతో కొంత ఇచ్చేవారు. ఆ డబ్బుతోనే ఇల్లు గడిచేది. ఒకరోజు గోల్కొండ హస్తకళలవారు మా వద్దకు వచ్చి మా కళను చూసి వర్క్‌షాప్‌ల గురించి అవగాహన కల్పించారు. బయటికి వెళ్తే పది రూపాయలు సంపాదించుకోవచ్చని భావించి నా భర్తతో కలిసి వర్క్‌షాప్‌లకు వెళ్లడం ప్రారంభించాను. ఢిల్లీ, లక్నో, ముంబై, నాగ్‌పూర్ ప్రాంతాల్లో నిర్వహించిన వర్క్‌షాప్‌లకు చంటిపిల్లలను తీసుకొని మరీ వెళ్లాం. అక్కడ నిర్వాహకులే వసతి కల్పించి, భోజనం పెట్టి పది రోజులు పని కల్పించేవారు. వర్క్‌షాప్ పూర్తికాగానే ఆలస్యం చేయకుండా పేమెంట్ ఇచ్చేవాళ్లు. అది మా ఎదుగుదలకు ఎంతో తోడ్పాటైంది.

నా చిన్నప్పుడు మా ఊరి సర్పంచ్ ఢిల్లీకి పోయొచ్చిన ఫొటోలు చూయిస్తే.. నేను ఒక్కసారైనా ఢిల్లీకి పోవాలని అనుకునేదాన్ని. విమానాలు ఆకాశంలో ఎగురుతుంటే చూసి మురిసేదాన్ని. కానీ, నేను ఇప్పటివరకు 50 సార్లు ఢిల్లీకి పోయొచ్చిన. అక్కడ కూడా వర్క్‌షాప్‌లు నిర్వహించిన. పనామాలో మా ఆయన చిక్కుకున్నప్పడు కేటీఆర్ సార్‌ను సంప్రదించాను. ఆయన వెంటనే అక్కడి అధికారులతో మాట్లాడి క్షేమంగా వాళ్లను తెలంగాణకు రప్పించారు. వారి ఖర్చులకు రూ.50వేలు కూడా అందజేశారు.
నేను ఎంత పనిచేసినా వాటి గురించి నలుగురికీ చెప్పాలంటే భయపడేదాన్ని. మా ఆయనే వాటిని వివరించేవాడు. ఒకసారి మహారాష్ట్రలో ఓ ఎక్స్పో నిర్వహించినప్పుడు అప్పుడున్న గవర్నర్ విద్యాసాగర్ రావు గారు మా వద్దకు వచ్చి.. ఏం చదువుకున్నావమ్మా అని అడిగారు. నిరక్షరాస్యురాలిని అని సమాధానం చెప్పాను. నా కళను చూసి ‘నీ చేతుల్లో సరస్వతుంద’ని కితాబిచ్చారు. నాకు పాస్‌పోర్ట్ లేని కారణంగా పెరూలో నిర్వహించే ప్రదర్శనకు మా ఆయనను పంపించాను. తెలంగాణ నుంచి మొత్తం ఐదుగురు వెళ్లి అక్కడ స్టాల్ పెట్టారు. ఆ సమయంలోనే కరోనా విజృంభించడంతో వాటిని నిలిపేశారు. ఆ ప్రదర్శన కోసం నగలు, ఉన్న భూమిని తాకట్టు పెట్టి దాదాపు 8 లక్షల విలువ చేసే బొమ్మలను పంపించాను.

కరోనా కాటేయడంతో మళ్లీ గడ్డు పరిస్థితులు దాపురించాయి. ఆ సమయంలోనే జిల్లా సెర్ఫ్ అధికారుల దగ్గర మా నెంబర్ తీసుకొని వీ హబ్ వాళ్లు ఫోన్ చేసి పిలుపించుకున్నారు. వెళ్లేటప్పుడు మేము చేసిన కొన్ని బొమ్మలను తీసుకెళ్లాం. అవి నచ్చడంతో రూ.5వేలు పెట్టి సీఈవో కొనుక్కున్నారు. ఆ తరువాత ఏడాది పాటు మార్కెటింగ్ స్కిల్స్ నేర్పించారు. స్టాల్స్ పెట్టించి ఎంతో ప్రోత్సహించారు. కాస్త ఊరట లభిస్తున్న సమయంలోనే మా అమ్మ, అత్తమ్మ వారం వ్యవధిలోనే కాలం చేశారు. ఆ తరువాత కొన్నిరోజులకే మా వారికి యాక్సిడెంట్ అయ్యింది. ఆయనను కాపాడుకునేందుకు చాలామందిని అప్పు అడిగాను. ఎవరూ ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో వీ హబ్ వాళ్లే రూ.2లక్షలు ఇచ్చి నా భర్తను కాపాడారు. ఆ మేలు నేను ఎన్నటికీ మరవను.
చేర్యాల పెయింటింగ్స్ మనుగడకు నేను చేస్తున్న కృషికి గాను రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు అవార్డులు వరించాయి. ఈ ఏడాది ‘లోకమాత అహల్యాబాయి హోల్కర్ మహిళా సమ్మాన్-2026’ అవార్డు ఢిల్లీ వేదికగా అందుకున్నాను. తెలుగు రాష్ర్టాలనుంచి ఈ అవార్డు అందుకున్న మహిళను నేనే కావడం నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ బొమ్మల తయారీలో నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వస్తున్నది. ఈ కళను అంతరించిపోకుండా కాపాడేందుకు 40 రోజులపాటు ముప్పైమంది మహిళలకు శిక్షణనిచ్చాను. అందులో పదిహేను మంది పూర్తిస్థాయిలో నేర్చుకున్నారు. ఒక ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నాను. ఎక్కువ ఆర్డర్లు వస్తే మిగతావారికి అప్పజెబుతున్నాను. వచ్చే ఆదాయంతో సొంత ఇల్లు కట్టుకున్నాను. ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను. వారికి చిన్నప్పటి నుంచే ఈ కళ అబ్బింది. చదువుకుంటూనే వర్క్‌షాపుల్లో పాల్గొంటున్నారు. రేపటి తరానికి ఈ కళను అందించాలన్నదే నా లక్ష్యం.