హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్, పీఈటీలు త్వరలోనే స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ కానున్నట్టు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి వెల్లడించారు. రెండు, మూడు వారాల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్టు చెప్పారు. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగిన షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కమిటీ సమావేశంలో శ్రీపాల్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు.
దీనిపై గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ సంతోష్ సమాధానమిస్తూ రెండు, మూడు వారాల్లో ఉత్తర్వులిస్తామని చెప్పినట్టు శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. గురుకుల పాఠశాలల సమయపాలన మార్పు ఉత్తర్వుల విషయాన్ని శ్రీపాల్‌రెడ్డి సమావేశంలో లేవనెత్తగా, త్వరలోనే సమయపాలన మారుస్తూ ఉత్తర్వులిస్తామని గిరిజన సంక్షేమశాఖ స్పెషల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ ప్రకటించారు.
ఆశ్రమ పాఠశాలలుగా మార్చిన స్కూళ్లల్లో టీచర్ పోస్టులను మంజూరుచేయాలనిచ ఆశ్రమ పాఠశాలల సీఆర్టీలకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, పార్ట్‌టైం టీచర్లు, లెక్చరర్లకు 12నెలల వేతనంతోపాటు మినిమం టైమ్ స్కేల్ అమలుచేయాలని కోరారు. వచ్చే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని గురుకులాలు, హాస్టళ్లకు ఎలక్ట్రిక్ గీజర్లు అందజేయాలని కమిటీ ప్రతిపాదించింది. ట్రైబల్ వెల్ఫేర్ పార్ట్‌టైం టీచర్లు రామారావు, వెంకన్న, అగ్గిరామ్, సురేశ్, పీఆర్టీయూ టీఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ధరావత్ రమేశ్ తదితరులు ఎస్టీ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.