పర్సంటేజీల వేట.. పాలమూరుపె ఊగిసలాట
‘పెండింగ్ పనులు జరుగాలంటే రూ.50 లక్షల కమీషన్ ఇవ్వాల్సిందే’ ఇదీ కొందరు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు (పీఆర్ఎల్ఐ) పనులు చేపట్టిన గుత్తేదారులకు ఎదురవుతున్న ఒత్తిళ్లు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది.
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు
- శాపంగా రేవంత్‌రెడ్డి సర్కార్ వైఖరి
- నీళ్లున్నా ఏదులకు చేరని కృష్ణమ్మ
- మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో నిరీక్షణే
- బీఆర్ఎస్ పోరుతో సర్కార్‌లో కదిలిక
- పరిహారం పేరిట ‘ప్యాకేజీ-3’ నిలిపివేత
- ఊగిసలాటలో ఎత్తిపోతల పథకం
కొల్లాపూర్, నవంబర్ 6: ‘పెండింగ్ పనులు జరుగాలంటే రూ.50 లక్షల కమీషన్ ఇవ్వాల్సిందే’ ఇదీ కొందరు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు (పీఆర్ఎల్ఐ) పనులు చేపట్టిన గుత్తేదారులకు ఎదురవుతున్న ఒత్తిళ్లు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఆ కమీషన్ ఇవ్వలేదన్న కారణంతో నిర్వాసితుల సమస్యలు, ఇతర అడ్డంకులను సాకుగా చూపుతూ ఏకంగా పనులే అడ్డుకుంటున్నారని ఉమ్మడి జిల్లాల్లో చర్చ జరుగుతున్నది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల ప్రజల దశాబ్దాల నాటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రేవంత్ సర్కార్ ఇలా శాపంగా మారిందని ప్రజలు మండిపడుతున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 95 శాతం పనులు పూర్తవగా.. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పనులు ముందుకు సాగడమే లేదు.
నాటి ప్రభుత్వం ముందుచూపుతో రూ.కోట్లు ఖర్చు చేసి పీఆర్ఎల్ఐలోని రిజర్వాయర్లు, పంపుహౌస్‌లు నిర్మించింది. 2023 సెప్టెంబర్ 16న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా పాలమూరు లిఫ్ట్-1లోని మొదటి పంపును ప్రారంభించి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసినా.. తర్వాత ఆ నీటిని వినియోగించుకోలేని అసమర్థతలో రేవంత్ సర్కార్ ఉన్నదని ఈ ప్రాంత రైతులు వాపోతున్నారు. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య ఉండే ప్రధాన కాలువ నిర్మాణ పనుల్లో మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేయడానికి కాంగ్రెస్ సర్కార్ అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఇది అద్దం పడుతున్నది. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటించి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా ప్రధాన కాలువ నిర్మాణం ఎందుకు ముందుకు వెళ్లలేదన్న ప్రశ్న తలెత్తుతున్నది. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆ సమస్యలనే పనులు నిలిపివేయడానికి సాకుగా చూపుతున్నదా? లేదా? పెండింగ్ పనులు జరుగాలంటే గుత్తేదారులు రూ.50 లక్షల కమీషన్ ఇవ్వాలని అధికార పార్టీ నాయకులు డిమాండ్ కారణమా? అన్న ప్రచారం ఇప్పుడు పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది.
నిలిచిన మూడో ప్యాకేజీ పనులు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మూడో ప్యాకేజీ ప్రధాన కాలువ పనులు నిలిచిపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రైతులతో కలిసి పంపులను ఆన్ చేస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వం దిగొచ్చి అక్టోబర్ 14న మొదటి, రెండో పంపులను ప్రారంభించింది. మోటర్లను ఆన్, ఆఫ్ చేస్తూ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరుకోక ముందే అక్టోబర్ 19న నిలిపివేశారు. దీంతో అప్పుడే అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. పంపుల ద్వారా ఎత్తిపోసిన కృష్ణా జలాలు నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మెయిన్ కెనాల్లోకి ప్రవేశించి సుమారు 4 కి.మీ. వరకు ప్రయాణించి అడ్డంగా ఉన్న కట్ట వద్ద నిలిచిపోయాయి. ఆ కట్టలను తొలగించి, అవసరమైన వంతెనల నిర్మాణం పూర్తిచేసి ఉంటే నీళ్లు నేరుగా ఏదుల రిజర్వాయర్‌కు చేరే అవకాశం ఉండేది. కానీ పనులు జరుగుతున్న సమయంలోనే రెండో ప్యాకేజీకి చెందిన నిర్వాసితుల పరిహారం వివాదం తెరపైకి వచ్చింది. అధికార పార్టీ నేతల జోక్యంపై ఆరోపణలు రావడంతో కీలమైన కాలువ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. చివరికి రైతులకు అందాల్సిన కృష్ణా జలాలు మెయిన్ కెనాల్‌లోనే నిలిచిపోయే దుస్థితి నెలకొన్నది.
పనులకు అధికార పార్టీ నేతల అడ్డంకులు
ప్యాకేజీ-3లోని ప్రధాన కాలువ పనుల్లో భాగంగా కుడికిళ్ల, నార్లాపూర్, తీర్నంపల్లి గ్రామాల మధ్య మెయిన్ కెనాల్‌పై ఉన్న కట్టలను తొలగించి వంతెనల నిర్మాణం చేపట్టేందుకు ఇప్పటికే పనులు ప్రారంభమై వేగంగా జరుగుతున్నాయి అనుకున్న తరుణంలోనే మొదట గతనెల 17న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన కంపెనీ చేపట్టిన రెండో ప్యాకేజీ పరిధిలో తమకు పరిహారం అందలేదని పేర్కొంటూ అధికార పార్టీకే చెందిన ఓ సర్పంచ్ ఆధ్వర్యంలో కొందరు నేతలు పనులను అడ్డుకున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నార్లాపూర్ రిజర్వాయర్‌లో ఉన్న కృష్ణాజలాలను ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లకు తరలించాలని డిమాండ్ చేస్తుండటంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లినట్టు వినికిడి.. అధికార పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్న నేతలే ప్రభుత్వంతో పరిహారం కోసం ప్రయత్నించకుండా పనులు నిలిపివేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తింది.
గత ప్రభుత్వానికి పేరొస్తుందనే అడ్డంకులా?
పాలమూరు ఉమ్మడి జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా మార్చేందుకు పాతాళంలో ఉన్న కృష్ణా నీటిని ఎత్తిపోసేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ శ్రీశైలం జలాశయంలోని డెడ్ స్టోరేజీ పాయింట్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నాంది పలికారు. అనతి కాలంలోనే 2023 సెప్టెంబర్ 16న పీఆర్ఎల్ఐ స్టేజీ-1లోని మొదటి పంప్‌ను ఆన్‌చేసి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి రెండున్నర టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను ఎత్తిపోసి జాతికి అంకితం చేశారు. అప్పటికే పీఆర్ఎల్ఐ ప్రాజెక్టులో అన్ని స్టేజీల్లో పంప్‌హౌస్‌లు, రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రాజెక్టులోని రిజర్వాయర్లకు అనుసంధానంగా ప్రధాన కాలువ పనుల్లో కేవలం రెండున్నర కిలోమీటర్ల కొద్దిపాటి పనులే పెండింగ్‌లో ఉండిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పనులను పూర్తిగా విస్మరించింది. రెండున్నరేండ్లు గడిచినా.. రెండున్నర కిలోమీటర్ల పెండింగ్ పనులను పూర్తి చేయకపోయింది. పంపులు సిద్ధంగా ఉండి, కృష్ణానదికి వరద వచ్చినా నార్లాపూరు రిజర్వాయర్‌లోకి నీళ్లు ఎత్తిపోయలేక పోయింది.
కుట్రతోనే కాంగ్రెస్ అడ్డుకట్టలు
నార్లాపూర్‌లో రిజర్వాయర్ హెడ్ రెగ్యులేటర్ దాటాక మెయిన్ కెనాల్‌కు అడ్డంగా ఉన్న కట్టను నేరుగా ఏదుల రిజర్వాయర్‌లోకి కృష్ణమ్మ పరుగులు పెట్టనున్నది. ఆ తర్వాత వెంటనే వట్టెం, కరివెన రిజర్వాయర్ల వద్దకు కూడా జలాలు చేరుతాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం కలలు సాకారం కావడంతోపాటు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన బీఆర్ఎస్ వెంట ఉంటారని, పాలమూరులో కాంగ్రెస్‌కు కాలం చెల్లుతున్నదని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కుట్రతో జలాలు రిజర్వాయర్లు దాటకుండా అడ్డుకట్టలు వేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నదీజలాలు రైతుల చెంతకు చేరొద్దనే భావనతోనే పరిహారం పేరుతో అధికార పార్టీ నేతలే పనులను అడ్డగించి నిలిపివేసిట్టు రైతులు ఆరోపిస్తున్నారు. పనులు నిలిచిపోవడానికి మరో తీవ్రమైన ఆరోపణ తెరపైకి వచ్చింది. పనులు చేపడుతున్న గుత్తేదారుల నుంచి కొందరు పార్టీ నాయకులు రూ.50 లక్షల వరకు డిమాండ్ చేశారనే ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆ మొత్తాన్ని ఇవ్వకపోవడంతోనే నిర్వాసితుల పరిహారం సమస్యను ముందుకు తెచ్చి పనులను అడ్డుకున్నారనే ప్రచారం జోరందుకున్నది.
రైతుల ఆశలపై సర్కార్ నీళ్లు
పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయి.. ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి జిల్లాల్లోని కరువు ప్రాంతాలకు సాగునీటి భరోసా దక్కుతుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని, వ్యవసాయ రంగం బలోపేతమవుతుందని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని భావించిన ఆయా జిల్లాల ప్రజల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతున్నదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టులో కీలకమైన ప్రధాన కాలువ నిర్మాణ పనులను పట్టించుకోని ప్రభుత్వ తీరుపై తెలంగాణ సాగునీటిరంగ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వానికి పేరొస్తుందనే విషయం పక్కనబెట్టి రైతుల ప్రయోజనం నెరవేర్చేందుకు ప్రభుత్వం పనిచేయాలని సమైక్య పాలకుల చేతిలో సాగునీటి గోస ఎదుర్కొన్న రైతులు రేవంత్ సర్కార్‌కు హితవు పలుకుతున్నారు.
బీఆర్ఎస్ అల్టిమేటంతో కదలిక
పాలమూరు ప్రాజెక్టుపై ప్రభుత్వ దురుద్దేశాన్ని పసిగట్టిన బీఆర్ఎస్ అధినాయకత్వం ‘చలో పాలమూరు’కు పిలుపునిచ్చింది. తప్పనిస్థితిలో సీఎం పీఆర్‌ఎల్‌ఐని క్షేత్రస్థాయిలో పరిశీలించి తూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహించి మమ అనిపించారు. సీఎం వచ్చి వెళ్లాక కూడా పీఆర్ఎల్ఐ పంప్‌లు ఆన్కాకపోవడం, పనుల్లో వేగం కనిపించకపోవడంతో బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును సందర్శించారు. పంపులను ఆన్ చేయకపోతే రైతులతో కలసి మోటర్లను తామే ఆన్ చేస్తామని అల్టిమేటం జారీచేశారు. ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు మోటర్లను ఆన్‌చేసి కృష్ణానది జలాలను నార్లాపూర్‌లో రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక స్వభావాన్ని పసిగట్టిన ప్రకృతి సైతం రిజర్వాయర్ హెడ్‌రెగ్యులేటర్‌ను దాటి సుమారు 4 కిలోమీటర్ల వరకు నదీ జలాలు వెళ్లి మెయిన్ కెనాల్‌కు అడ్డంకిగా ఉన్న కట్ట వద్ద నిలిచిపోయాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
రైతుల ప్రయోజనాలే ముఖ్యం
ప్రభుత్వం ఎవరికి పేరొస్తుందనే ఆలోచన చేయకుండా ప్యాకేజీ-3 పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి. అసలు పనులు నిలిచిపోచేందుకు గల కారణాలను అన్వేషించి, పరిష్కారానికి చొరవ చూపాలి. నార్లాపూర్ రిజర్వాయర్‌లో ఉన్న నీటిని ముందు రిజర్వాయర్లకు తరలించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలి. రైతుల ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పనిచేయాలి.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

